‘బిగ్ డిబేట్’లో హిల్లరీ ఆధిక్యం! | Clinton and Trump face off in first presidential debate | Sakshi
Sakshi News home page

‘బిగ్ డిబేట్’లో హిల్లరీ ఆధిక్యం!

Published Wed, Sep 28 2016 1:57 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

డిబే ట్‌లో మాట్లాడుతున్న డెమొక్ర టిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్. చిత్రంలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ - Sakshi

డిబే ట్‌లో మాట్లాడుతున్న డెమొక్ర టిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్. చిత్రంలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్

అధ్యక్ష అభ్యర్థుల మధ్య పోటాపోటీగా సాగిన తొలి ముఖాముఖి చర్చ
వాదనలో హిల్లరీ ఆధిపత్యం.. అసహనంతో ట్రంప్
డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థికి అధ్యక్షురాలయ్యే సామర్థ్యం లేదన్న ట్రంప్
ట్రంప్‌ది అవగాహనలేమి అంటూ హిల్లరీ ధ్వజం

 హంప్‌స్టెడ్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ప్రత్యక్ష, ముఖాముఖి పోరుకు తెరలేచింది. డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్(68), ఆమె రిపబ్లికన్ ప్రత్యర్థి డోనాల్డ్ ట్రంప్(70)ల మధ్య తొలి ముఖాముఖి చర్చ మంగళవారం పోటాపోటీగా సాగింది. గంటన్నర పాటు ఆవేశకావేశాలు, వాదప్రతివాదాలు, వ్యక్తిగత విమర్శలు, ఎత్తిపొడుపులు, వ్యంగ్య వ్యాఖ్యలు, భావోద్వేగాలు, భిన్న హావభావాలతో రసవత్తరంగా సాగిన ఈ బిగ్ డిబేట్‌లో హిల్లరీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు.

ఎక్కువగా ఆవేశానికి లోనుకాకుండా.. జాతివివక్ష, ఐసిస్ ముప్పు, అమెరికా ఆర్థికరంగం, యువతకు ఉద్యోగిత తదితర విభిన్న అంశాలపై స్పష్టమైన వైఖరి వెల్లడిస్తూ.. ట్రంప్‌ను ఆత్మరక్షణలోకి నెట్టేశారు. వివిధ అంశాలపై ట్రంప్ వైఖరిని ఎండగడుతూ వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తూ మరింత రెచ్చగొట్టారు. డిబేట్‌లో పలుమార్లు ట్రంప్ అసహనానికి లోనవడం, మంచినీళ్లు తాగడం కనిపించింది. హంప్‌స్టెడ్‌లోని హాఫ్స్ట్రావర్సిటీలో జరిగిన ఈ చర్చను టీవీల్లో 10 కోట్ల మంది చూశారు. ఎవరికి ఓటేయాలో ఇంకా నిర్ణయించుకోని మెజారిటీ ఓటర్లు ఈ ముఖాముఖిలతో నిర్ణయానికి వచ్చే అవకాశముంది.

నవంబర్ 8న జరిగే అధ్యక్ష ఎన్నికల కన్నా ముందు ఇటువంటివి మొత్తం మూడు ముఖాముఖి వాదనలు జరుగుతాయి. తొలి చర్చలో హిల్లరీ  విజయం సాధించారని 62% ఓటర్లు పేర్కొనగా, 27% మాత్రం ట్రంప్‌దే విజయమని నిర్ధారించారనిసీఎన్‌ఎన్/ఓఆర్‌సీ సర్వే తేల్చింది. పలు అంశాలపై పూర్తి అవగాహనతో హిల్లరీ చర్చకు వచ్చినట్లు కనిపించిందని విశ్లేషకులన్నారు. అక్టోబర్ 9న రెండో, 19న మూడో డిబేట్ జరగనున్నాయి.

ఎవరి సామర్థ్యం ఎంత?..: 68 ఏళ్ల హిల్లరీ ఇటీవల న్యుమోనియా బారిన పడిన నేపథ్యంలో.. కమాండర్ ఇన్ చీఫ్‌గా అమెరికా అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తించగల శక్తిసామర్థ్యాలు ఆమెకు లేవని ట్రంప్ అన్నారు. ‘ఈ దేశ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి గొప్ప శక్తి సామర్థ్యాలు కావాలి. హిల్లరీ అలా కనిపించడం లేదు’ అన్నారు. దీనికి హిల్లరీ చిరునవ్వుతో స్పందిస్తూ.. ‘112 దేశాలు పర్యటించి, పలు శాంతి ఒప్పందాలు, కాల్పుల విరమణ ఒప్పందాలు చేసుకుని, 11 గంటల పాటు కాంగ్రెస్ కమిటీ ముందు వివరణ ఇచ్చిన తరువాత నాసామర్థ్యం గురించి ఆయన మాట్లాడవచ్చు’ అంటూ ఒబామా తొలి ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా తను సాధించిన ఘనతను చెప్పుకున్నారు.

 ఒబామాపై జాతి వివక్ష వ్యాఖ్యలు.. అధ్యక్షుడు బరాక్ ఒబామాపై జాతివివక్ష వ్యాఖ్యలు చేశారని హిల్లరీ ట్రంప్‌ను విమర్శించారు. ట్రంప్ జాతివివక్ష ఆరోపణలు చేయడం కొత్తేం కాదు కానీ, అమెరికాలో జన్మించిన వాడు కాదంటూ ఒబామాపై చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణం’ అన్నారు. మహిళలను,ముస్లింలను అవమానిస్తూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను హిల్లరీ గుర్తు చేశారు.

 ఐసిస్ అంతం ఎలా?: అమెరికాకు ప్రమాదకరంగా పరిణమించిన ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ను అంతం చేసేందుకు ట్రంప్ వద్ద సరైన ప్రణాళిక లేదని హిల్లరీ విమర్శించారు. అంతర్జాతీయంగా ఐసిస్‌ను ఏకాకిని చేసే చర్యలు తన ప్రణాళికలో ఉన్నాయన్నారు ట్రంప్ స్పందిస్తూ.. ఇరాక్‌పై ఒబామా విధానాల వల్లే ఐసిస్ ఆవిర్భవించిందని విమర్శించారు. ఇరాక్‌పై దాడి తొలి తప్పైతే.. మధ్యంతరంగా అక్కడినుంచి తప్పుకోవడం మరో తప్పని, దాంతోనే ఇసిస్ ఆవిర్భావానికి వేదిక ఏర్పడిందని ఆరోపించారు.

అమెరికా ఉద్యోగాలను చైనా తదితర దేశాలు దొంగలిస్తున్నాయని, ఆ పద్దతి మారాన్నారు. అమెరికాను కుదిపేసిన గృహ నిర్మాణ సంక్షోభంతో లాభపడిన కొద్దిమంది సంపన్నుల్లో ట్రంప్ ఒకరని హిల్లరీ విమర్శించారు. వాతావరణ మార్పు అనేది ఒక భ్రమ అన్న ట్రంప్ కామెంట్‌ను హిల్లరీ ఎద్దేవా చేశారు. ఎన్‌బీసీ నైట్లీ న్యూస్ యాంకర్ లెస్టర్ హోల్ట్ ఈ ముఖాముఖికి సమన్వయకర్తగా వ్యవహరించారు. ‘నా ఆవేశమే నా బలం’ అని ట్రంప్ అనగా ‘ఓహో.. అవునా?’ అంటూ హిల్లరీ స్పందించిన సందర్భంతో పాటు  పలు సందర్భాల్లో నవ్వులు కూడా చిందాయి.

ఈమెయిల్స్ గుట్టు.. పన్ను రిటర్న్స్ రట్టు
ప్రముఖ వ్యాపార వేత్త అయిన ట్రంప్ కొన్నేళ్లపాటు టాక్స్ రిటర్న్‌లను దాఖలు చేయలేదని హిల్లరీ విమర్శించారు. ‘రిటర్న్‌లను ట్రంప్ విడుదల చేయకపోవడం వెనుక కొన్ని కారణాలుండొచ్చు. ఆయన తను చెప్పుకుంటున్నంత సంపన్నుడు కాకపోవచ్చు.. లేదా చెప్పుకుంటున్నంత స్థాయిలో దానాలు చేసి ఉండకపోవచ్చు.. లేదా తన అప్పుల గురించి మనకు తెలియకూడదని అనుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే మనకు తెలిసిన సమాచారం మేరకు ట్రంప్ వాల్‌స్ట్రీట్‌కు, విదేశీ బ్యాంకులకు 650 మిలియన్ డాలర్లు అప్పు ఉన్నారు’ అని ధ్వజమెత్తారు.

దానిపై ట్రంప్ స్పందిస్తూ.. ‘టాక్స్ రిటర్న్స్‌ను బహిరంగపర్చేందుకు నేను సిద్ధమే. అయితే, ముందు విదేశాంగ మంత్రిగా ఉండగా హిల్లరీ ప్రైవేటు ఈమెయిల్ సర్వర్‌ను ఉపయోగించి చేసిన 33 వేల మెయిల్స్‌ను బహిరంగ పర్చాలి. డిలీట్ చేసిన ఆ ఈమెయిల్స్‌ను ఆమె బహిరంగపరిస్తే.. ఆ మరుక్షణమే నేను నా ట్యాక్స్ రిటర్న్స్‌ను విడుదల చేస్తాను’ అన్నారు. దీనికి ప్రతిగా.. విదేశాంగ మంత్రిగా అధికార పదవిలో ఉన్న తాను ప్రైవేట్ ఈ మెయిల్ సర్వర్‌ను ఉపయోగించడం తప్పేనని, ఈ విషయంపై గతంలోనే వివరణ ఇచ్చానని హిల్లరీ వివరించారు. హిల్లరీకి పాలనలో అనుభవం ఉంది కానీ.. అది మంచి అనుభవం కాదని, మరో నాలుగేళ్లు ఆమెను భరించలేమని ట్రంప్ అన్నారు. విధానపరమైన అవగాహన లేమితో ట్రంప్ ఉన్నారని హిల్లరీ బదులిచ్చారు.
డిబేట్ ముగిసిన తరువాత మద్దతుదారులకు హిల్లరీ అభివాదం. కార్యక్రమానికి హాజరైన హిల్లరీ భర్త, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, కూతురు చెల్సియా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement