
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా విస్తరించి కరాళనృత్యం చేస్తోన్న కరోనా వైరస్ వల్ల ఈ రోజు(శనివారం) కడపటి వార్తలు అందే వరకు 28,239 మంది మృత్యువాత పడ్డారు. వైరస్ బారిన పడిన బాధితుల సంఖ్య దాదాపు 6,14,000కు చేరుకుంది. మృతుల సంఖ్య ఒక్కో దేశంలో ఒక్కో తీరుగా ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా సేకరించిన మృతుల సంఖ్య విశ్లేషించగా కరోనా బారిన పడిన ప్రతి 22 మందిలో ఒకరు మృత్యువాత పడుతున్నారు. ఇటలీలో మాత్రం మృతుల సంఖ్యనే కాకుండా మృతుల శాతం కూడా చాలా ఎక్కువగా ఉంది.
(చదవండి : ‘కరోనా’ హెల్మెట్‌తో పోలీసుల వినూత్న ప్రచారం)
ఇటలీలో ఇప్పటి వరకు 9,100 మంది మరణంచగా బాధితుల్లో మృతుల సంఖ్య 11.3 శాతం ఉంది. జర్మనీలో మృతుల శాతం ప్రపంచంలోనే అతి తక్కువగా 0.62 శాతం ఉంది. అక్కడి దాదాపు 50 వేల మంది వైరస్ బారిన పడగా 304 మంది మరణించారు. సాధారణంగా బాధితుల సంఖ్య ఎక్కువగా ఉండి, మృతుల సంఖ్య తక్కువగా ఉన్నట్లయితే మృతుల సంఖ్య మున్ముందు కూడా తక్కువగా ఉంటుందని అంచనా వేయవచ్చు. అయితే బ్రిటన్‌లో లాగా ముదిరిన కేసులకు పరీక్షలు జరిపి, పెద్దగా వైరస్ లక్షణాలను లేనివారిని వదిలేస్తే మృతుల సంఖ్య పెరుగుతుంది. ప్రస్తుతం బ్రిటన్‌లో మృతుల సంఖ్య 5.21 శాతం ఉంది. కరోనా వైరస్ పుట్టుకొచ్చిన చైనాలోని వుహాన్ పట్టణంలో మృతుల సంఖ్య 1.4 శాతాన్ని దాటకపోవడం విశేషం. కరోనా వైరస్ బాధితుల్లో మృతుల సంఖ్య సరాసరి 3.4 శాతం ఉండవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment