
న్యూజెర్సీ: ఆవుపేడ కేకులు.. ఇది ఈపాటికే వినే ఉంటారు. మన దేశంలో అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు వీటి అమ్మకాలను ఎప్పుడో ప్రారంభించాయి. అయితే ఆవు పేడ కేకులు ఇప్పుడు సరిహద్దులు దాటి విస్తరించింది. అమెరికాలోని న్యూజెర్సీలో ఓ దుకాణంలో ఆవుపేడతో చేసిన కేకులు అమ్మకానికి పెట్టారు. దీని ధర ఆన్‌లైన్ రేట్ల కన్నా తక్కువగా ఉన్నాయి. పది కేకులు రూ. 214కే లభ్యమవుతాయి. దీనితో అక్కడి దుకాణానికి వచ్చిన జనం ఓసారి దాన్ని పరిశీలించాకే వెనుదిరుగుతున్నారు.
అయితే ఇక్కడ ఓ ముఖ్య గమనిక.. ఈ కేకులు తినడానికి మాత్రం కాదు అని దుకాణదారులు బల్లగుద్ది మరీ చెప్తున్నారు. కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలకోసమే అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఈ పేడ కేకుల ప్యాకెట్‌పై భారత ప్రోడక్ట్ అని రాసి ఉంది. దీన్ని ఫొటో తీసిన మహిళ ఆమె సోదరుడు సమర్ హలంకర్‌కు పంపించింది. అతడు దాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతోపాటు అతనికి తలెత్తిన ప్రశ్నను వెలిబుచ్చాడు. ‘ఇంతకీ ఇది దేశీ ఆవుల పేడతో చేసినవా? లేక విదేశీ ఆవుల పేడతో చేసినవా?’ అని అనుమానపడ్డాడు. దీనికి నెటిజన్ల నుంచి ఫన్నీ కామెంట్లు వచ్చిపడుతున్నాయి. ‘ఏముంది? అనుమానం నివృత్తి చేసుకోడానికి పేడ కేకులను కాస్త రుచి చూడండి.. మీకే తెలుస్తుంది’ అంటూ ఓ నెటిజన్ ఉచిత సలహా ఇచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment