
డొమినికాపై విరుచుకుపడిన ‘మారియా’
► పెనుగాలులతో బుల్లిద్వీపం అల్లకల్లోలం
శాన్ జువాన్: పెనుతుపాను మారియా చిన్నద్వీపమైన డొమినికాపై విరుచుకుపడింది. అత్యంత ప్రమాదకరమైన ఐదో కేటగిరీలో ఉన్న ఈ తుపాను మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇటీవలి ఇర్మా తుపాను ఈ ద్వీపంపై ఇటీవల విరుచుకుపడి విధ్వంసం సృష్టించడం తెలిసిందే. తాజాగా మారియా తుపాను కూడా ఇదే మార్గంలో పయనిస్తోంది. బుధవారంనాటికి ఈ తుపాను çప్యూర్టోరికోను తాకే అవకాశం ఉంది. ‘తుపాను ప్రభావం కారణంగా బలమైన గాలులు వీస్తున్నాయి. ‘ఇక మనం దేవుడి దయవల్ల బతికి బట్ట కట్టాల్సిందే’ అంటూ ప్రధానమంత్రి రూజ్‌వెల్ట్ స్కెరిట్ పేర్కొన్నారు.
ఈ మేరకు ప్రజలను హెచ్చరిస్తూ ఆయన ఫేస్‌బుక్‌లో అనేక పోస్టులు పెట్టారు. ఇళ్లు, భవంతుల పై స్టీలుతో ఏర్పాటుచేసిన పైకప్పులు గాలి తీవ్రతతో కొట్టుకుపోతున్న దృశ్యాలను కూడా తాను చూడాల్సివస్తుందేమోనంటూ ఆందోళన వ్యక్తం చేశారు,. అరగంట తర్వాత ఆయన మరో పోస్టు కూడా పెట్టారు. ‘మా ఇంటి పైకప్పు ఎగిరిపోయింది. ఇంటిలోకి వరద నీరు కూడా వచ్చింది. అయితే భద్రతాసిబ్బంది నన్ను కాపాడారు’ అంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు. పెనుతుపాను నేపథ్యంలో పాఠశాలలతోపాటు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలంటూ ప్రజలకు సూచించారు. అనేక ప్రాంతాలు నీటమునిగిపోయే ప్రమాదం ఉందంటూ హెచ్చరించారు.