మరియా.. ఇక మహా ప్రళయమేనా?
మరియా.. ఇక మహా ప్రళయమేనా?
Published Tue, Sep 19 2017 8:39 AM | Last Updated on Tue, Sep 19 2017 4:46 PM
సాక్షి, ఫ్యూర్టో రికో: సరిగ్గా రెండు వారాల క్రితం ఇర్మా హరికేన్ భీభత్సం కరేబియన్ దీవులను కకావికలం చేసేసి అక్కడి నుంచి అమెరికాపై తన ప్రతాపాన్ని చూపించేసింది. విలయతాండవ ఉధృతి త్వరగానే తగ్గినప్పటికీ.. నష్టం నుంచి బయటపడేందుకు మరికొన్ని రోజలు సమయం పట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో మరో పెను తుఫాన్ విరుచుకుపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరియా తుఫాన్ ఈ ఉదయం తీరం దాటినట్లు అధికారులు ప్రకటించారు. గంటకు 165 మైళ్ల (215 కిలోమీటర్ల) వేగంతో కూడిన గాలులు వీయటం ఇప్పటికే మొదలైనట్లు తెలుస్తోంది. దీంతో కేటగరీ 5 కింద తీర ప్రాంతంలో హెచ్చరికలు జారీ చేశారు.
దక్షిణ ఆగ్నేయ సఫిర్ సింప్సన్ ప్రాంతం నుంచి మొదలైన ఈ తుఫాన్ బుధవారం ఉదయంలోగా ఫ్యూర్టో రికో తీరాన్ని తాకే అవకాశం ఉందని తెలుస్తోంది. డొమినికాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండటంతో అక్కడ ఉన్న 72,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. నార్త్ కరోలినాకు నుంచి లీవార్డ్ మార్టినిక్, పోర్టారికో, యూఎస్, బ్రిటీష్ వర్జీన్ ఐల్యాండ్స్ పై మరియా ప్రభావం చూపనుంది. గత 85 ఏళ్లలో అతి శక్తివంతమైన తుఫాన్ ఫ్యూర్టో రికోను తాకబోతున్నట్లు వారంటున్నారు.
మరోవైపు హరికేన్ జోస్ కూడా ప్రచండ గాలులతో అమెరికాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాగా, మరియా అట్లాంటిక్ సముద్రానికి నాలుగో అతి భయంకరమైన హరికేన్‌గా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ యేడాది 13 తుఫాన్లు అట్లాంటిక్ నుంచి ప్రారంభమై వివిధ దేశాలపై తమ ప్రభావం చూపాయి.
Advertisement
Advertisement