
తల్లి నుంచి బిడ్డకు హెచ్ఐవీ వ్యాప్తిని నిర్మూలించారు
హవానా: తల్లి నుంచి బిడ్డకు హెచ్‌ఐవీ వ్యాప్తి (మదర్ టు ఛైల్డ్ ట్రాన్స్‌మిషన్) ని సంపూర్ణంగా నిర్మూలించిన మొట్టమొదటి దేశంగా క్యూబా చరిత్రకెక్కింది. ప్రస్తుతం ఆదేశంలో హెచ్ఐవీ బాధిత తల్లులకు పుట్టే పిల్లలెవ్వరికీ ఆ మహమ్మారి సొకడంలేదని, ఇది అరుదైన ఘనత అని ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం ప్రకటించింది.
తల్లికి హెచ్‌ఐవీ ఉన్న ప్పుడు ప్రసవం ముందర కొద్దికాలంపాటు యాంటీ రిట్రోవైరల్ డ్రగ్స్ ఇవ్వడంతోపాటు ప్రసవం తర్వాత పుట్టిన పాపకు కూడా తగిన మోతాదులో మెడిసిన్ వాడాల్సి ఉంటుందని తద్వారా క్యూబా వైద్యులు హెచ్ఐవీ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకున్నారని డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ మార్గరేట్ చాన్ చెప్పారు. తల్లి నుంచి బిడ్డకు హెచ్‌ఐవీ వ్యాపించకుండా ఉండేందుకు వాడే మందుల్లో నెవిరపిన్, జిడోవుడిన్ (దీన్ని ఏజడ్‌టీ అని కూడా అంటారు) అనే ఔషధాలు ప్రభావవంతగా పనిచేశాయని తెలిపారు.
అమెరికా ఒత్తిళ్లతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమను డబ్ల్యూహెచ్ వో వంటి అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికైనా గుర్తించినందుకు సంతోషంగా ఉందని, ప్రపంచంలో ఏ బిడ్డకూ తల్లి నుంచి హెచ్ఐవీ సోకకుండా నిరోధించేందుకు తమ వంతు సహకారం అందిస్తామని క్యూబా వైద్యులు పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.4 లక్షలమంది హెచ్ఐవీ బాధిత మహిళలు గర్భం దాల్చుతుండగా వారిలో 15 నుంచి 45 శాతం మందికి పుట్టే బిడ్డలు కూడా వైరస్ తోనే పురుడుపోసుకుంటున్నారు. అయితే వైద్యశాస్త్రంలో నూతన పరిశోధనల ఫలితంగా 2009 నుంచి తల్లి నుంచి బిడ్డకు వైరస్ వ్యాప్తి తగ్గుతూ వస్తోంది.