మనుషులు శాశ్వతం కాదేమో.. కానీ వారి మధ్య ఉన్న ప్రేమ శాశ్వతం..
అలైసా మెండోజా... పది నెలల క్రితమే తండ్రిని పోగొట్టుకుంది. అల్లారుముద్దుగా చూసుకునే నాన్న లేడన్న బాధను కొద్దికొద్దిగా దిగమింగుతూ మామూలు మనిషి అవుతోంది. ఇంతలో ఓ రోజు ఆమెకు చనిపోయిన తండ్రి నుంచి మెయిల్ వచ్చింది. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురైంది. దాన్ని ఓపెన్ చేయాలంటేనే ఆమెకు వెన్నులో వణుకు పుట్టింది. భయంతో కొద్ది రోజులపాటు దాన్ని పక్కన పెట్టినప్పటికీ ఓ రోజు ధైర్యం చేసి తెరచి చూసింది. అందులో తన భార్య 27వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా తల్లిని సర్‌ప్రైజ్ చేయమంటూ కూతురిని కోరాడు. ఎలా సెలబ్రేట్ చేయాలో క్షుణ్ణంగా వివరించాడు.
భార్యకు ఇష్టమైన గులాబీ పూలు
భార్యకు ఇష్టమైన పువ్వుల నుంచి బెలూన్ల వరకు ప్రతి అంశాన్ని పొందుపర్చాడు. కూతురిని కూడా ఆ ఒక్కరోజు బుద్ధిగా నడుచుకోమని చెప్పాడు. అంతేకాదు వివాహ వార్షికోత్సవంతోపాటు, తర్వాత రానున్న ప్రేమికుల దినోత్సవం, పుట్టిన రోజు పండుగలకు తన భార్యకు ఇష్టమైన గులాబీ పూలను అందజేసేందుకు దగ్గరలోని పూలవ్యాపారికి ఇప్పటికే సరిపడా డబ్బులు చెల్లించాడని అతడి కూతురు వెల్లడించింది. తండ్రి కోరిక మేరకు కూతురు కూడా తల్లి పెళ్లిరోజును ఘనంగా సెలబ్రేట్ చేయాలని నిర్ణయించుకుంది. జూన్ 10న పెళ్లి రోజు కావడంతో అమ్మను సర్‌ప్రైజ్ చేసేందుకు మెండోజా ముందు రోజు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5.30 గంటల వరకు ఎంతగానో కష్టపడింది.
ఈ పెళ్లి రోజును తల్లి ఎప్పటికీ మర్చిపోదు
ఇల్లును అందంగా డెకరేట్ చేస్తూ, మధ్యమధ్యలో ప్రేమకు జ్ఞాపకాలుగా మిగిలిన ఫొటోలను అతికించే పనిలో నిమగ్నమైంది. తల్లికి ఇష్టమైన వంటకాలు కూడా సిద్ధం చేసి ఉంచింది. అనంతరం ఉదయం ఆరు గంటలకు తల్లిని నిద్ర లేపగా ఆమె తన చుట్టూ ఉన్నది చూసి తన కళ్లను తానే నమ్మలేకపోయింది. ఈ సర్‌ప్రైజ్ చూసి కన్నీటి పర్యంతం అయ్యింది. "అమ్మ ముఖంలో ఆనందం కనిపించగానే నా శ్రమ, అసలసటకు ఫలితం లభించింది" అంటూ మెండోజా ఈ విషయాన్నంతటినీ ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ నిజంగా అద్భుతం, కంటతడి పెట్టించారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
పెళ్లి రోజు: చనిపోయిన తండ్రి లేఖ
Published Wed, Jun 17 2020 8:32 AM | Last Updated on Thu, Dec 3 2020 12:21 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment