మేయర్ సింహాసనమున శునకం!
వాషింగ్టన్: వాషింగ్టన్: అది అమెరికాలోని ఒకానొక చిన్న పట్టణం. కొద్దిరోజుల క్రితమే అక్కడ మేయర్ పీఠానికి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఓ శునకం మేయర్ పీఠాన్ని దక్కించుకుంది.ఆషామాషీగా కాదు.. అత్యధిక మెజారిటీతో గెలిచింది. శునకానికి మేయర్ సింహాసనం దక్కడం ఏమిటీ..? అని ఆశ్చర్యపోకండి. ఇది నిజంగా నిజం. ఇదంతా కొలరాడోలోని డివైడ్ అనే పట్టణంలో జరిగింది. ఇక్కడ పౌర నాయకుడు లేకపోవడంతో జంతు సంరక్షణకు నిధులు సమీకరించేందుకు ‘టెల్లర్ కౌంటీ రీజినల్ యానిమల్ షెల్టర్’ అనధికారికంగా ఈ మేయర్ ఎన్నిక చేపట్టింది. ఆన్‌లైన్‌లో జరిగే ఎన్నికల్లో ఒక్కో ఓటుకు ఒక్కో డాలర్ వస్తుంది.
ఈ ఎన్నికల్లో ఏడు శునకాలు, ఓ తోడేలు, ఓ గాడిద, ఓ పిల్లి, ఓ ముళ్లపంది పోటీ పడ్డాయి. అయితే పా కెట్టెల్ అనే రెస్క్యూ డాగ్ 2,387 ఓట్లు సాధించి ఎన్నికల్లో ఘనవిజయం సాధించి మేయర్ కిరీటం దక్కించుకుంది. కెయినీ అనే తోడేలు కెట్టెల్‌కు గట్టిపోటీ ఇచ్చినా రెండో స్థానంతో సరిపెట్టుకుని డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైంది. 1,790 ఓట్లతో మూడో స్థానంలో నిలిచిన బస్టర్ అనే పిల్లి వైస్రాయ్ పదవి దక్కించుకుంది. ఈసారి ఎన్నికల్లో మొత్తం 12,091 ఓట్లు పోలయ్యాయి. ఇప్పటి వరకూ ఇక్కడ వాల్టర్ అనే మూడు కాళ్ల పిల్లి మేయర్‌గా ఉంది. వాల్టర్ రిటైర్ కావడంతో దాని స్థానంలో కెట్టెల్ మేయర్ పీఠం అధిష్టించనుంది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం త్వరలోనే అట్టహాసంగా జరగనుంది.