గూచ్‌లాండ్ : విశ్వాసానికి మారు పేరుగా చెప్పుకునే పెంపుడు కుక్కలే ఆ యజమానురాలి పాలిట క్రూరమృగాలయ్యాయి. అత్యంత దారుణంగా ఆమె పీకను కొరికేసి ప్రాణాలు తోడేశాయి. ఎన్నెన్నో కేసులు చేధించిన పోలీసులు సైతం బిత్తరపోయేలా చేసిన ఈ గటన అమెరికా వర్జీనియా రాష్ట్రంలోని గూచ్‌లాండ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన కథనం ప్రకారం..
కుక్కలతో మార్నింగ్ వాక్‌కు వెళ్లి.. : బెతాని లిన్ స్టీఫెన్స్ అనే 22 ఏళ్ల యువతి.. గురువారం(డిసెంబర్ 14) ఉదయం పెంపుడు కుక్కలు రెండింటిని వాకింగ్‌కు తీసుకెళ్లింది. అలా వెళ్లిన ఆమె ఎంతకీ తిరిగిరాకపోవడంతో కుటుంబీకులు తలా ఓ దిక్కుకు వెళ్లి గాలించారు. తర్వాతి రోజు (శుక్రవారం) ఉదయం.. ఇంటికీ కిలోమీటర్ దూరంలో కుక్కలను గుర్తించాడు బెతాని తండ్రి. ‘ కుక్కలు నిల్చున్న చోట ఏదో జంతువు పడిపోయి ఉన్నట్లు అనిపించింది. తీరా దగ్గరికి వెళ్లాక ఆ దృశ్యాన్ని చూసి కుప్పకూలిపోయా’ అని ఆ తండ్రి చెప్పుకొచ్చాడు.
పలు కోణాల్లో దర్యాప్తు : పిట్ బుల్ జాతికి చెందిన ఆ రెండు కుక్కలే బెతాని పీక కొరికి, ముఖాన్ని రక్కేసి చంపేశాయని దర్యాప్తు అధికారులు నిర్ధారణకు వచ్చారు. కుక్కల దాడి నుంచి కాపాడుకునే ప్రయత్నంలో మృతురాలి చేతులకు కూడా తీవ్ర గాయాలైనట్లు పేర్కొన్నారు. నమ్మశక్యంకాని ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు దర్యాప్తు అధికారులు పలు కోణాల్లో పరిశీలన చేశారు. బెతానిని ఎవరైనా హత్యచేసి ఉంటారనిగానీ, లేక ఆత్మహత్యకు పాల్పడినట్లుగానీ ఎలాంటి ఆధారాలు దొరకలేదని, వైద్యులు నిర్ధారించినట్లు కుక్కలే ఆమెను కొరికి చంపేశాయని దర్యాప్తు అధికారులు తెలిపారు. తన 40 ఏళ్ల సర్వీసులో ఇలాంటి కేసును చూడలేదని, ఇకపై చూడకూడదని అనుకుంటున్నట్లు దర్యాప్తు బృందంలోపి అధికారి ఒకరు అన్నారు.
ఆ కుక్కలను చంపేయండి : తమ గారాలపట్టి బెతాని ప్రాణాలు పోవడానికి కారణమైన పెంపుడు కుక్కలను తక్షణమే అంతం చేయాలని ఆమె కుటుంబీకులు అధికారులను కోరారు. అయితే, బెతాని స్నేహితులు మాత్రం దర్యాప్తు ముగింపుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ రెండు కుక్కలూ చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచీ బెతానికి అలవాటేనని, ఏనాడూ ఆమెకు హానిచెయ్యని జంతువులు.. ఇప్పుడు చంపేశాయంటే నమ్మశక్యంగా లేదని, కేసులో తేలాల్సిన విషయం ఇంకేదో ఉందని అంటున్నారు. బెతాని స్నేహితుల వాదనను దర్యాప్తు అధికారులు తోసిపుచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment