ట్రంప్ మరో సంచలన నిర్ణయం
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కర్బన ఉద్గారాలను తగ్గించుకునే ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలగాలని తుది నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని యాక్సియాస్ న్యూస్ సంస్థ తెలిపింది. అత్యంత విశ్వసనీయమైన వర్గాల ద్వారా ఈ విషయం తెలిసినట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న గ్రీన్‌హౌస్ ఉద్గారాల్లో 56 శాతం విడుదల చేస్తున్న దాదాపు 70 దేశాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయ.
అయితే ఈ చరిత్రాత్మక ఒప్పందంపై సంతకం చేసేందుకు ట్రంప్ నిరాకరించారు. ఇంతకుముందు దీనిపై నిర్ణయం తీసుకోడానికి తనకు మరింత సమయం అవసరమని ఆయన చెప్పారు. ఈ వారంలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని కూడా గతంలో చేసిన ట్వీట్‌లో తెలిపారు. ఇప్పుడు కుండ బద్దలుకొట్టేశారు. ప్రపంచంలోని ముఖ్యమైన దేశాల్లో ఈ ఒప్పందం మీద సంతకం చేయని ఏకైక దేశం అమెరికా కావడం గమనార్హం.