paris climate deal
-
అమెరికాకు మరో అవకాశం
పారిస్ ఒప్పందం విషయంలో ఘర్షణాత్మక ధోరణికి జీ–20 సభ్యదేశాలు దూరం హాంబర్గ్: పర్యావరణ మార్పిడి ఒప్పందం విషయంలో జీ–20 సదస్సు అమెరికాపై ఎటువంటి ప్రభావం చూపలేకపోయింది. ఈ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్టు గత నెలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం తెలిసిందే. ఈ ఒప్పందంలోకి తిరిగి వచ్చేందుకు అమెరికాకు తలుపులు బార్లా తెరిచిందే తప్ప ఘర్షణ ధోరణికి దూరంగా ఉండిపోయింది. నానాటికీ భూతాపం పెరిగిపోతున్న నేపథ్యంలో కర్బన ఉద్గారాలను నియంత్రించడమే లక్ష్యంగా పారిస్‌లో జరిగిన సదస్సులో ఒప్పందం కుదుర్చుకోవడం తెలిపిందే. ప్రపంచంలోని ఆర్థికంగా అత్యంత శక్తిమంతమైన దేశాలే కర్బన ఉద్గారాలను అత్యధికస్థాయిలో విడుదల చేస్తున్నాయి. 2015 నాటి పారిస్ ఒప్పందం వెనక్కి తీసుకోలేనిదంటూ జీ–20 సదస్సు ముగింపు సందర్భంగా విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో సభ్యదేశాలు పేర్కొన్నాయి. ఈ ఒప్పందంనుంచి అమెరికా వైదొలగాన్ని సదరు ప్రకటనలో ప్రస్తావించాయి. ఈ ఒప్పందాన్ని సమర్థించే కీలక దేశాల మదిలో ఇప్పుడు ఒకటే ఆందోళన,. ఇతర దేశాలు కూడా అమెరికా బాటలో నడుస్తాయేమోననే సందేహం వాటి మనసును తొలిచేస్తోంది. అమెరికా నిర్ణయం ప్రభావం టర్కీపై పడింది. ‘అమెరికా ప్రకటన నేపథ్యంలో పార్లమెంట్లో ఈ ఒప్పందానికి ఆమోదముద్ర వేయకూడదనే దిశగా ముందుకు సాగుతున్నాం’ అని ఆ దేశ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్....జీ 20 వేదికగా ప్రకటించడం తెలిసిందే. అమెరికా ప్రకటన విషయంలో జీ 20 సభ్యదేశాలు..అమెరికాకు వ్యతిరేకంగా గట్టిగా గళం విప్పలేకపోయాయి. వాషింగ్టన్ ప్రకటనను ప్రస్తావిస్తూ ఈ ఒప్పందం విషయంలో అగ్రరాజ్యానికి మినహాయింపు ఇచ్చేశాయి. ఎప్పటికైనా అమెరికా...ఈ ఒప్పందంలోకి తిరిగి వస్తుందని భావిస్తున్నాయి. ఈ విషయమై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ మాట్లాడుతూ ట్రంప్ ఈ విషయంలో తన మనసు మార్చుకుంటారంటూ ఆశాభావం వ్యక్తం చేయగా బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మే మాట్లాడుతూ అమెరికా తిరిగి వచ్చే అవకాశం ఉందని తాను భావిస్తున్నట్టు చెప్పారు. జర్మనీ చాన్సెలర్ ఏంజెలా మెర్కెల్ కూడా ధోరణిలో స్పందించారు. అవరోధాలను తొలగించాలి ఐఎంఎఫ్ చీఫ్ ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ విషయంలో నిర్లిప్తత తగదని హెచ్చరిస్తూ... జీ 20 సభ్య దేశాలు సంస్కరణలను చేపట్టాలని, వాణిజ్యం విషయంలో ఎదురయ్యే అవరోధాలను తగ్గించుకోవాలని, సబ్సిడీలు తగ్గించాలని ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టిన్ లాగర్డే సూచించారు. ప్రపంచ ఆర్థిక భద్రత కోసం ఈ సదస్సును వేదికగా చేసుకుని కార్యాచరణ ప్రణాళికను రూపొందించినందుకు అభినందించారు. ప్రపంచ దేశాలన్ని చేయిచేయి కలిపి తమకు ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించుకోవాలని, అలాగే అత్యంత బలోపేతమైన, సమ్మిళితమైన. సమతుల్యమైన ఆర్థిక వృద్ధిని సాధించాలని హితవు పలికారు. పకడ్బందీగా నియమనిబంధనలను రూపొందించుకోవడంద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవాలి’ అని అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ క్రమేణా కోలుకుంటోందని, ఇది వచ్చే ఏడాది నాటికి పుంజుకుంటుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా జీ 20 సదస్సుకు హాజరైన లాగార్డే ఇతర ప్రముఖులతోపాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీతోనూ భేటీ అయ్యారు. మూడోరోజూ అల్లర్లు ప్రపంచీకరణకు వ్యతిరేకంగా మూడోరోజు కూడా ఆందోళనకారులు అల్లర్లకు పాల్పడ్డారు. వేదికకు సమీపంలో ఏర్పాటుచేసిన బారికేడ్లకు ఆదివారం నిప్పంటించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిపై నీటిఫిరంగులను ప్రయోగించారు. ఆందోళనకారుల్లో 144 మందిని అదుపులోకి తీసుకున్నారు. గురువారం నుంచి జరుగుతున్న ఈ అల్లర్లలో 200 మందికిపైగా అధికారులు గాయపడడం తెలిసిందే. -
గెలిచిన ట్రంప్
హాంబర్గ్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జీ20 వేదికగా విజయం సాధించారు. వాతావరణ ఒప్పందం, వ్యాపారాలకు సంబంధించిన కీలకాంశాలపై శనివారం ప్రపంచ నాయకులతో ట్రంప్ చర్చించారు. పారిస్ వాతావరణ ఒప్పందంపై ట్రంప్ తన నిర్ణయాన్ని కొనసాగించొచ్చని పేర్కొన్నాయి. ఇందుకు సంబంధించిన స్టేట్మెంట్లో 19 దేశాలు ట్రంప్ తన ఇష్టానుసారంగా వాతావరణ ఒప్పందంపై నిర్ణయం తీసుకోవచ్చని సంతకాలు చేశాయి. కాగా, జీ20 సమ్మిట్ కోసం ముస్తాబైన హాంబర్గ్ నగరంలో ప్రజలు సమ్మిట్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. శనివారం కూడా హాంబర్గ్‌లో ఈ ఆందోళనలు కొనసాగాయి. -
భూమి కోసం ఏం చేద్దాం?
విశ్లేషణ మానవులు పర్యావరణాన్ని తిరిగి పునరుద్ధరించలేని వి«ధంగా నాశనం చేసిన ఈ యుగంలో వ్యక్తులుగా, సమాజాలుగా మనం దాని గురించి ఏం చేస్తున్నాం? మీరే ఆలోచించండి. పారిస్ వాతావరణ మార్పుల ఒప్పందం నుంచి డొనాల్డ్ ట్రంప్ వైదొలగడంపై ఒక అమెరికన్ విదూషకుడు ఒక వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు. శ్వేతసౌధంలో ఆ ప్రకటనను చేసిన ప్రదే శాన్ని దృష్టిలో ఉంచుకుని ‘‘ఈ లెక్కన చూస్తే, ఇలా మాట తప్పేట్టయితే అప్పుడిక్కడ ఉండేది గులాబీల తోట కాదు, బ్రహ్మజెముడు వనం’’ అని వ్యాఖ్యానించాడు. పారిస్ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకోవడంపై ట్రంప్ తీసుకున్న నిర్ణయం గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. కానీ, మిగతా అభివృద్ధి చెందిన దేశాలలో ప్రధానమైనవి మాత్రం తమ వాగ్దానాలకు కట్టుబడి ముందుకు సాగాలనే కృత నిశ్చయాన్ని చూపాయి. తక్షణమే స్పందించడం ద్వారా బరాక్ ఒబామా... అమెరికా నగరాలు, వ్యాపార సంస్థలు పారిస్ ఒప్పందంలోని వాగ్దానాలకు కట్టుబడటానికి సమీకృతం కావడానికి తోడ్పడింది. ఆశా రేఖ తొంగి చూస్తు న్నది ఇక్కడే. వాతావరణ మార్పుల విపత్కర విపరిణామాన్ని అరికట్టడంలో ప్రభుత్వాల కంటే ప్రజలే ఎక్కువ పాత్రను నిర్వహించాల్సి ఉంది. ఒక సమాజంగా మనం ఈ విషయంలో ఏమైనా చేస్తున్నామా? భరింపశక్యంకాని వేసవి మన దేశంలో ఇప్పుడు ముగింపునకు వస్తోంది. ఈ వేసవి, వాతావరణ మార్పు గురించి మనం ఏమైనా చేయా లని మెత్తగా తట్టి చెప్పడానికి మించి చేసిన హెచ్చరిక. దీన్ని పూర్తిగా ప్రభుత్వాలకు వదిలి పెట్టేయడం తీవ్ర తప్పిదం అవు తుంది. ప్రభుత్వాలు ఆలోచిస్తాయే తప్ప, తమ సొంత లక్ష్యాలను సాధిం చడానికి తగినంతగానూ, త్వరితం గానూ ఎప్పుడూ అవి ఆచరణకు దిగవు. ఇది కేంద్రం నుంచి గ్రామ పంచాయతీల వరకు అంతటా ఉన్నది. పారిస్ ఒప్పందం వివరాల జోలికి పోవడం లేదు. కాకపోతే సంపన్నదేశాలు వాతా వరణాన్ని కొల్లగొట్టడంవల్ల అభివృద్ధిచెందిన దేశాలు మూల్యాన్ని చెల్లించాల్సి రావడం, లక్ష్యాల సాధన వాటికి కష్టం కావడం వంటి సమస్యలున్నాయి. అయినా పౌరులుగా మనం, మన పాత్ర విమర్శనాత్మకంగా ఉండటానికీ, పర్యావరణ పరిరక్షణకు మద్దతుగా కొవ్వొత్తుల ఊరేగింపులు జరపడం, మానవ హారాలను నిర్మించడానికీ పరిమితమని తరచుగా భావిస్తుంటాం. విషాదకరంగా మనం మన చిన్న పరిధులలోనే చేయగల సాను కూల కార్యాచరణ మాత్రం కానరాదు. ఐస్‌క్రీమ్ పార్లర్‌కు వెళ్లాలని కారు బయటకు తీసి నప్పుడల్లా అది వాతావరణానికి హానికరమైన ఉద్గారాలను విడుదల చేస్తుంది. అంత కంటే కొద్దిగా నడవడమే మంచిదని మనకు తోచదు. వాతావరణం మరింతగా క్షీణిం చిపోకుండటానికి ప్రతి చిన్న చర్యను చేపట్టడానికి హామీని కల్పించేలా మన చైతన్యం విస్తరించాలి. ఇంధన వాడకంలో ఎలాంటి వృ«థానైనా అరికట్టడం వాటిలో ఒకటి. నా ప్రతిపాదనలు మరీ అమాయకమైనవిగా అని పించొచ్చు, కానీ ఆవశ్యకమైనవి. ఏదో ఒక వనరు అవసరమైన ప్రతి పనిని గురించి ఆలోచించండి. గదిలోంచి బయటకు వస్తున్న ప్పుడు లైటు ఆపు చేశానా? లెడ్ లైట్లను పెట్టానా, లేదా? నేను లేనప్పుడు ఫ్యాన్ తిరు గుతూనే ఉందా? ఏసీ అభిలషణీయం, సౌకర్యవంతం అయిన 24 డిగ్రీల ఉష్ణోగ్రత వద్దనే ఉందా? ప్రభుత్వాలు పలు ప్లాస్టిక్ సంచులను నిషేధిస్తే, వాటి వాడకాన్ని ఎందుకు అనుమ తిస్తున్నారని నిలదీయాలి. మరీ ముఖ్యంగా, కూరగాయలు, కిరాణా దుకాణదారుల వద్ద కొనుగోలుదారులు వస్తువులను గుడ్డ సంచులలోనే పట్టుకుపోతున్నారా? వీధిలోని టీ బడ్డీలో వాడే ప్లాస్టిక్ కప్పు నుంచి అన్ని ప్లాస్టిక్ వస్తువులు భూగ్రహానికి తీవ్ర హానిని కలి గించేవే. చేతులు కడిగేటప్పుడు పంపులను తిప్పి ఉంచే తీరు తీవ్ర నిర్లక్ష్యంతో కూడిన నీటి వృథాకు కారణం. ఇక షవర్ కింద నిమిషాల తరబడి నిలబడటం మరింత వృథా. ఇలా ఈ జాబితా ఎంతైనా సాగుతుంది. మానవులు పర్యావరణాన్ని తిరిగి పునరుద్ధరించలేని వి«ధంగా నాశనం చేసిన ఈ ఆంత్రోపొసీన్ యుగంలో ఇతరులు ఈ ప్రపంచం గురించి ఏం చేస్తున్నారో మనకు తెలియదు. కానీ వ్యక్తులుగా, సమాజాలుగా మనం దాని గురించి ఏం చేస్తున్నాం? మీరే ఆలోచించండి. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు మహేష్ విజాపృకర్ ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
భారత్‌పై మరింత భారం మోపిన ట్రంప్
న్యూయార్క్: భూతాపోన్నతి ఉద్గారాలను తగ్గించాలనే (క్లైమేట్ ఛేంజ్) పారిస్ ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గురువారం ప్రకటించడం భారత్‌ను ఆర్థికంగా దెబ్బతీసే అంశం. దీంతో వేలాది కోట్ల రూపాయల భారం భారత్‌పై పడే ప్రమాదం ఏర్పడింది. అంచనాలకు విరుద్ధంగా జాతీయ వద్ధి రేటు ఈ ఏడాది 7.1 శాతం దాటని పరిస్థితుల్లో ఇది నిజంగా ప్రతికూల పరిణామమే. భారత్ లాంటి వర్ధమాన దేశాలు కార్బన ఉద్గారాలను అరికట్టే చర్యలకుగాను అమెరికా లాంటి అభివద్ధి చెందిన దేశాలు ఆర్థిక సహాయం అందించడం పారిస్ ఒప్పందంలో అంతర్భాగం. దీని కోసం గ్రీన్ క్లైమెట్ ఫండ్‌ను ఏర్పాటు చేశారు. దీనికి అభివద్ధి చెందిన దేశాలు రెండు లక్షల కోట్ల నుంచి నాలుగు లక్షల కోట్ల డాలర్ల వరకు నిధులు చెల్లించాలి. పారిస్ క్లైమేట్ ఛేంజ్ ఒప్పందం కుదిరిన 2015 డిసెంబర్ నాటి నుంచి ఏడాదికి వంద కోట్ల డాలర్ల చొప్పున ఐదేళ్లపాటు చెల్లిస్తానని అమెరికా, ఇంగ్లండ్, చైనా ఇతర అభివద్ధి చెందిన దేశాలు హామీ ఇచ్చాయి. ఈ హామీలో భాగంగా అమెరికా తొలి విడతగా వంద కోట్ల డాలర్లు, అంటే దాదాపు 6,441 కోట్ల రూపాయలను చెల్లించింది. ఈ ఏడాది చివరి నాటికి మరో రెండు విడతలు చెల్లించాల్సి ఉన్న నేపథ్యంలో ఒప్పందం నుంచి తప్పుకోవడం భారత్ లాంటి వర్ధమాన దేశాలకు భారమే. భారత్‌పై ఎలా భారం? పారిస్ ఒప్పందం ప్రకారం 2030 నాటికి భారత్ తమ కార్బన ఉద్గారాలను 35 శాతం నుంచి 33 శాతానికి తగ్గించాలి. అందుకోసం పునర్వినియోగ ఇంధన వనరులపై దష్టిని పెట్టాలి. 2025 నాటికి 175 గిగావాట్స్ ఇంధనాన్ని శిలాజేతర ఇంధనాల (పెట్రోలు, డీజిల్ కాకుండా) నుంచి ఉత్పత్తి చేయాలి. బొగ్గు వినియోగాన్ని 20 శాతం తగ్గించాలి. 50 లక్షల హెక్టార్లలో అడవిని పెంచాలి. ఈ చర్యలకు వేలాది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. వర్థమాన దేశాల్లో కర్బన ఉద్గారాల స్థాయి ఎంత ఉంది ? ఎంత తగ్గించారు? దాని కోసం ఆర్థికంగా ఎంత ఖర్చు అయింది? అన్న అంశాలను పరిగణలోకి తీసుకొని గ్రీన్ క్లైమెట్ ఫండ్ నుంచి ‘ఎయిడ్’ రూపంలో ఆర్థిక సహాయం అందిస్తారు. ధనిక దేశాలే ఎందుకు భరించాలి? అభివద్ధి చెందిన అమెరికా లాంటి దేశాలే నేడు ప్రపంచంలో కాలుష్యం పెరగడానికి కారణం అవడం, ఇప్పటికీ ఆ దేశాలే ఎక్కువగా కార్బన ఉద్గారాలను వాతావరణంలోకి వదులుతున్నందున ఆ దేశాల నుంచి గ్రీన్ క్లైమేట్ ఫండ్‌ను వసూలు చేయాలని పారిస్ ఒప్పందం నిర్ణయించింది. అమెరికా తర్వాత ఎక్కువ కాలుష్యానికి కారణం అవుతున్న దేశాల్లో చైనా రెండో స్థానంలో ఉంది. చైనాతోపాటు భారత్ కూడా కాలుష్యాన్ని నియంత్రించేందుకు సరైన చర్యలు తీసుకోవడం లేదని, అందుకే తాము ఒప్పందం నుంచి తప్పుకుంటున్నామని కూడా డోనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అసలు పారిస్ ఒప్పందం ఏమిటీ? భూతోపాన్నతి మరో రెండు డిగ్రీల సెల్సియస్ పెరిగితో భూగోళంపై ప్రళయ పరిస్థితులు ఏర్పతాయన్నది పరిశోధకుల అంచనా. అంటే మంచు కొండలు, గుట్టలు కరిగిపోతాయి. సముద్ర మట్టాలు పెరిగిపోతాయి. పల్లపు ప్రాంతాలు నీటిలో మునిగిపోతాయి. వాతావరణంలో భారీ మార్పులు సంభవిస్తాయి. రుతువులు మారిపోతాయి. ఆహారానికి, నీటికి సంక్షోభం ఏర్పడుతుంది. ఇంకా ఊహించని పరిస్థితులు సంభవించవచ్చు. అందుకని భూతాపోన్నతి ఎట్టి పరిస్థితుల్లో 1.5 డిగ్రీల సెల్సియస్‌కు మించకుండా ముందస్తు చర్యలు తీసుకోవడానికే పారిస్ ఒప్పందం కుదిరింది. ఇందులో అభివద్ధి చెందిన, వర్ధమాన, పేద దేశాల కేటగిరీలుగా లక్ష్యాలను నిర్దేశించారు. దీనిపై 2015, డిసెంబర్ 195 దేశాలు సంతకాలు చేశాయి. 2016, అక్టోబర్ నెల నుంచి అమల్లోకి వచ్చింది. ఎవరు నాయకత్వం వహించాలి? బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కుదిరిన ఈ ఒప్పందాన్ని ఐక్యరాజ్య సమితి మార్గదర్శకెత్వంలో అమెరికా అమలు చేయాలి. నిజంగా అమెరికా తప్పుకున్నప్పుడు ఎవరు ఈ ఒప్పందాన్ని అమలుచేసే బాధ్యతను స్వీకరిస్తారన్న ప్రశ్న వస్తోంది. వాస్తవానికి అమెరికా తర్వాత ఎక్కువ కాలుష్యానికి కారణం అవుతున్న చైనా నాయకత్వం స్వీకరించాలి. అయితే అందుకు సుముఖత చూపించడం లేదు. భారత్ లాంటి వర్ధమాన దేశాలు ముందుకొచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ దేశాలకు అంత ఆర్థిక సామర్థ్యం లేదు. పైగా మనకు చైనా లాంటి దేశాలతో సఖ్యత లేదు. -
ట్రంప్ మరో సంచలన నిర్ణయం
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కర్బన ఉద్గారాలను తగ్గించుకునే ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలగాలని తుది నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని యాక్సియాస్ న్యూస్ సంస్థ తెలిపింది. అత్యంత విశ్వసనీయమైన వర్గాల ద్వారా ఈ విషయం తెలిసినట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న గ్రీన్హౌస్ ఉద్గారాల్లో 56 శాతం విడుదల చేస్తున్న దాదాపు 70 దేశాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయ. అయితే ఈ చరిత్రాత్మక ఒప్పందంపై సంతకం చేసేందుకు ట్రంప్ నిరాకరించారు. ఇంతకుముందు దీనిపై నిర్ణయం తీసుకోడానికి తనకు మరింత సమయం అవసరమని ఆయన చెప్పారు. ఈ వారంలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని కూడా గతంలో చేసిన ట్వీట్లో తెలిపారు. ఇప్పుడు కుండ బద్దలుకొట్టేశారు. ప్రపంచంలోని ముఖ్యమైన దేశాల్లో ఈ ఒప్పందం మీద సంతకం చేయని ఏకైక దేశం అమెరికా కావడం గమనార్హం. -
మోదీకు ఒబామా అభినందనలు
న్యూయార్క్: పారిస్ ఒప్పందానికి భారత్ పచ్చజెండా ఊపడంపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశంసించారు. ఒప్పందంపై ట్విట్టర్ ద్వారా స్పందించిన ఒబామా శాంతిని చాటిన మహనీయుడు మహాత్మాగాంధీ బాటలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భారత ప్రజలు ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నారని పోస్టులో రాశారు. ఇందుకు ప్రకృతిని కాపాడుకోవడం భారతీయుల లక్షణమని మోదీ స్పందించారు. పారిస్ వాతావరణ ఒప్పందపత్రాలను యూఎన్ కు భారత్ అందించిన అనంతరం యూఎన్ సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ భారతీయులందరికీ ధన్యవాదాలని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ చారిత్రత్మాక ఒప్పందం భారత్ ను అభివృద్ధి పథంలో నడిపిస్తుందని అన్నారు. గ్రీన్ హోస్ వాయువులను అత్యధికంగా విడుదల చేస్తున్న దేశాల వరుసలో మూడో స్ధానంలో ఉన్న భారత్ ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై ఫ్రాన్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలెండ్ హర్షం వ్యక్తం చేశారు.