అమెరికాకు మరో అవకాశం
పారిస్ ఒప్పందం విషయంలో ఘర్షణాత్మక ధోరణికి జీ–20 సభ్యదేశాలు దూరం
హాంబర్గ్: పర్యావరణ మార్పిడి ఒప్పందం విషయంలో జీ–20 సదస్సు అమెరికాపై ఎటువంటి ప్రభావం చూపలేకపోయింది. ఈ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్టు గత నెలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం తెలిసిందే. ఈ ఒప్పందంలోకి తిరిగి వచ్చేందుకు అమెరికాకు తలుపులు బార్లా తెరిచిందే తప్ప ఘర్షణ ధోరణికి దూరంగా ఉండిపోయింది. నానాటికీ భూతాపం పెరిగిపోతున్న నేపథ్యంలో కర్బన ఉద్గారాలను నియంత్రించడమే లక్ష్యంగా పారిస్‌లో జరిగిన సదస్సులో ఒప్పందం కుదుర్చుకోవడం తెలిపిందే.
ప్రపంచంలోని ఆర్థికంగా అత్యంత శక్తిమంతమైన దేశాలే కర్బన ఉద్గారాలను అత్యధికస్థాయిలో విడుదల చేస్తున్నాయి. 2015 నాటి పారిస్ ఒప్పందం వెనక్కి తీసుకోలేనిదంటూ జీ–20 సదస్సు ముగింపు సందర్భంగా విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో సభ్యదేశాలు పేర్కొన్నాయి. ఈ ఒప్పందంనుంచి అమెరికా వైదొలగాన్ని సదరు ప్రకటనలో ప్రస్తావించాయి. ఈ ఒప్పందాన్ని సమర్థించే కీలక దేశాల మదిలో ఇప్పుడు ఒకటే ఆందోళన,. ఇతర దేశాలు కూడా అమెరికా బాటలో నడుస్తాయేమోననే సందేహం వాటి మనసును తొలిచేస్తోంది. అమెరికా నిర్ణయం ప్రభావం టర్కీపై పడింది. ‘అమెరికా ప్రకటన నేపథ్యంలో పార్లమెంట్‌లో ఈ ఒప్పందానికి ఆమోదముద్ర వేయకూడదనే దిశగా ముందుకు సాగుతున్నాం’ అని ఆ దేశ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్....జీ 20 వేదికగా ప్రకటించడం తెలిసిందే.
అమెరికా ప్రకటన విషయంలో జీ 20 సభ్యదేశాలు..అమెరికాకు వ్యతిరేకంగా గట్టిగా గళం విప్పలేకపోయాయి. వాషింగ్టన్ ప్రకటనను ప్రస్తావిస్తూ ఈ ఒప్పందం విషయంలో అగ్రరాజ్యానికి మినహాయింపు ఇచ్చేశాయి. ఎప్పటికైనా అమెరికా...ఈ ఒప్పందంలోకి తిరిగి వస్తుందని భావిస్తున్నాయి. ఈ విషయమై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ మాట్లాడుతూ ట్రంప్ ఈ విషయంలో తన మనసు మార్చుకుంటారంటూ ఆశాభావం వ్యక్తం చేయగా బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మే మాట్లాడుతూ అమెరికా తిరిగి వచ్చే అవకాశం ఉందని తాను భావిస్తున్నట్టు చెప్పారు. జర్మనీ చాన్సెలర్ ఏంజెలా మెర్కెల్ కూడా ధోరణిలో స్పందించారు.
అవరోధాలను తొలగించాలి ఐఎంఎఫ్ చీఫ్
ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ విషయంలో నిర్లిప్తత తగదని హెచ్చరిస్తూ... జీ 20 సభ్య దేశాలు సంస్కరణలను చేపట్టాలని, వాణిజ్యం విషయంలో ఎదురయ్యే అవరోధాలను తగ్గించుకోవాలని, సబ్సిడీలు తగ్గించాలని ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టిన్ లాగర్డే సూచించారు. ప్రపంచ ఆర్థిక భద్రత కోసం ఈ సదస్సును వేదికగా చేసుకుని కార్యాచరణ ప్రణాళికను రూపొందించినందుకు అభినందించారు. ప్రపంచ దేశాలన్ని చేయిచేయి కలిపి తమకు ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించుకోవాలని, అలాగే అత్యంత బలోపేతమైన, సమ్మిళితమైన. సమతుల్యమైన ఆర్థిక వృద్ధిని సాధించాలని హితవు పలికారు. పకడ్బందీగా నియమనిబంధనలను రూపొందించుకోవడంద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవాలి’ అని అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ క్రమేణా కోలుకుంటోందని, ఇది వచ్చే ఏడాది నాటికి పుంజుకుంటుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా జీ 20 సదస్సుకు హాజరైన లాగార్డే ఇతర ప్రముఖులతోపాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీతోనూ భేటీ అయ్యారు.
మూడోరోజూ అల్లర్లు
ప్రపంచీకరణకు వ్యతిరేకంగా మూడోరోజు కూడా ఆందోళనకారులు అల్లర్లకు పాల్పడ్డారు. వేదికకు సమీపంలో ఏర్పాటుచేసిన బారికేడ్లకు ఆదివారం నిప్పంటించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిపై నీటిఫిరంగులను ప్రయోగించారు. ఆందోళనకారుల్లో 144 మందిని అదుపులోకి తీసుకున్నారు. గురువారం నుంచి జరుగుతున్న ఈ అల్లర్లలో 200 మందికిపైగా అధికారులు గాయపడడం తెలిసిందే.