
‘నా ఛాతిని చూశారా! ఇలాంటి బ్రహ్మండమైన ఛాతిని ఇంత వరకు తాము చూడలేదంటూ డాక్టర్లే ముచ్చటపడ్డారు’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం నాడు సోషల్ మీడియాలో తన మార్ఫింగ్ ఫొటోను ట్వీట్ చేశారు. అందులో హాలీవుడ్ సినిమా ‘రాఖీ’లో నటించిన సిల్వస్టర్ స్టాలోన్ బాక్సింగ్ ఫొటోకు తన తలను మార్ఫింగ్‌తో అతికించారు. ‘వాల్టర్ రీడ్ మెడికల్ సెంటర్’కు గత వారం ట్రంప్ అనుకోకుండా సందర్శించడం పట్ల జర్నలిస్టులు ఆయనకు గుండెపోటు వచ్చి ఉండవచ్చంటూ ఊహాగానాలను ప్రచురించారు.
దానికి సమాధానంగా ట్రంప్ తన మార్ఫింగ్ ఫొటోను ట్వీట్ చేశారు. ఆయన గురువారం నాడు వెస్ట్‌పామ్ బీచ్‌లోని ‘ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ క్లబ్’కు వచ్చారు. ఆయన అక్కడే ‘థ్యాంక్స్ గివింగ్ హాలీడే’ జరుపుకోనున్నారు. ఆయన భార్య, కూతురు కూడా అక్కడ కనిపించడం ఈ విషయాన్ని రుజువు చేస్తోంది. థ్యాంక్స్ గివింగ్ హాలీడే పేరును మార్చాలని పలు వర్గాల నుంచి తనపై ఒత్తిడి వస్తున్నప్పటికీ మార్చడం లేదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పంటలు ఇంటికి వచ్చినందుకు జరుపుకునే వ్యవసాయ పండుగే ‘థ్యాంక్స్ గివింగ్ హాలీడే’. ప్రతి సంవత్సరం నవంబర్ నాలుగో గురువారం నాడు అమెరికన్లు ఈ పండుగను పెద్ద ఎత్తున జరుపుకుంటారు. 1789 నుంచి ఈ ఆనవాయితీని వారు పాటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment