
ట్రంప్‌కు మరిన్ని తంటాలు
► సెనేట్ కమిటీ ముందు సాక్ష్యం చెబుతానన్న కోమీ
► ఎఫ్‌బీఐ కీలక వ్యక్తి ఎవరు?
(సాక్షి నాలెడ్జ్ సెంటర్)
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గతేడాది అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ను ఓడించడానికి రష్యాతో కుమ్మక్కయారనే వ్యవహారంలో కొత్త విషయాలు వెల్లడవుతున్న క్రమంలో తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నారు. ఈ నెల 9న ఈ కుంభకోణంపై దర్యాప్తు కొనసాగిస్తున్నారనే కోపంతో ఎఫ్‌బీఐ డైరెక్టర్ జేమ్స్ కోమీని ట్రంప్ హఠాత్తుగా తొలగించాక ఈ వారం మరిన్ని పరిణామాలు శరవేగంతో సంభవించాయి. అ కమిటీ ముందు హాజరై సాక్ష్యం చెబుతానని ఇప్పుడు కోమీ ప్రకటించడంతో ఈ అంశం మరింత ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ట్రంప్ పాత్రపై కొంత పరిశోధన జరిపిన కోమీని ఈ నెల 29న జరిపే అమెరికా మెమోరియల్ డే తర్వాత ఏరోజైనా ఈ కమిటీ ముందు సాక్ష్యం చెప్పాల్సిందిగా ఆదేశిస్తారని తెలుస్తోంది. ఏడాదిగా రెండు ప్రధాన రాజకీయపక్షాల మధ్య నలిగిన ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ కమిటీకి ఎలాంటి ‘సంచలనాత్మక’ విషయాలు వెల్లడిస్తారనే విషయం పలువురిలో ఆసక్తి రేపుతోంది. ఫెడరల్ దర్యాప్తు సంస్థ అధిపతిగా ప్రతి విషయాన్ని కాగితంపై పెట్టే అలవాటున్న కోమీ మెమోల్లోని అంశాలు ఇప్పటికే వెల్లడయ్యాయి. మాజీ జాతీయ భద్రతా సలహాదారు మైకేల్ ఫ్లిన్‌పై దర్యాప్తు నిలిపివేయాలని ట్రంప్ కోరిన విషయం ఈ మెమోల్లో ఒకటి.
నిక్సన్ మాదిరిగా పొరపాటు మీద పొరపాటు!
రష్యాతో కుమ్మక్కు వ్యవహారంలో అధ్యక్షుని పాత్రపై దర్యాప్తునకు ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ రాబర్ట్ మ్యూలర్‌ను ప్రత్యేక ప్రాసిక్యూటర్‌గా నియమించాక ‘ఇది అమెరికా చరిత్రలో ఓ రాజకీయ నాయకునిపై ఘోరమైన వేధింపు చర్య’ అని ట్రంప్ ట్వీట్ చేశాక ఆయన తీవ్ర భయాందోళనకు గురవుతున్నారనే భావన సర్వత్రా నెలకొంది. 1972 అధ్యక్ష ఎన్నికల్లో వాటర్‌గేట్ కుంభకోణానికి పాల్పడిన అప్పటి అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ మాదిరిగా ఇప్పుడు వరుసగా ‘తప్పటడుగులు’ వేస్తూ రష్యా వ్యవహారంలో వాస్తవాలు బయటకు రాకుండా కప్పిపెట్టడానికి అధ్యక్షుడు ప్రయత్నిస్తున్నారనే అనుమానం అత్యధిక అమెరికన్లను వేధిస్తోంది. రష్యాతో చేతులు కలిపారనడానికి ఆధారాలు లభ్యమౌతున్నాయనే భయంతోనే కోమీని పదవి నుంచి తొలగించడమే కాక, మరుసటి రోజు వైట్‌హౌస్‌లోతనను కలిసిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, అమెరికాలో రష్యా రాయబారితో మాట్లాడుతూ, కోమీ ఉద్వాసనతో పీడ విరగడైందని, ఆయన చేసింది తిక్క పని అని ట్రంప్ చెప్పిన మాటలు రికార్డవడమే కాక, వాటిని ప్రసిద్ధ అమెరికా దినపత్రిక వెల్లడించడం అధ్యక్షుడి పరువును మరింత దిగజార్చింది. తప్పు చేశాడు కాబట్టే కప్పిపుచ్చే పనులకు ట్రంప్ పాల్పడుతున్నారనే ఆరోపణ వినిపిస్తోంది.
‘కీలక వ్యక్తి’ ఎవరు?
రష్యాతో ఎన్నికల కుమ్మక్కుపై జరిపే ఫెడరల్ దర్యాప్తులో వైట్‌హౌస్‌లో పనిచేస్తున్న సీనియర్ సలహాదారును ‘కీలక వ్యక్తి’గా సాక్ష్యం చెప్పాలని కోరే అవకాశాలున్నాయని ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక శుక్రవారం వెల్లడించింది. దర్యాప్తు సంస్థకు అనుమానం ఉన్న మనిషినే కీలక వ్యక్తిగా భావించవచ్చు. కీలక వ్యక్తి సాక్ష్యం చెప్పాక ఆయన అనుమానితుడా, నిందితుడా అనేది తేలుతుంది. ఈ కీలక వ్యక్తి ఎవరనే విషయమై ఊహాగానాలు సాగుతున్నాయి. ఇప్పటివరకూ ఈ కుంభకోణం దర్యాప్తులో కీలక వ్యక్తులుగా ప్రాచుర్యం పొందిన మాజీ జాతీయ భద్రతా సలహాదారు మైకేల్ ఫ్లిన్, ట్రంప్ ప్రచార నిర్వాహకుడు పాల్ మానాఫోర్ట్, విదేశాంగ విధాన సలహాదారు కార్టర్ పేజ్, రాజకీయ వ్యూహకర్త రోజర్ స్టోన్ ఇప్పుడు ప్రభుత్వ పదవుల్లో లేరు. మరి ఎవరీ కీలక వ్యక్తి అంటే, ట్రంప్ పెద్దల్లుడు, సీనియర్ సలహాదారు జారెడ్ కష్‌నర్ పేరు వినిపిస్తోంది. ఈ కీలక వ్యక్తిపై ఎఫ్‌బీఐ ఓ కన్నేసి ఉంచిందని కూడా ఈ పత్రిక వివరించింది.