
స్టోర్మీ డేనియల్స్.. డొనాల్డ్ ట్రంప్ (జత చేయబడిన చిత్రం)
వాషింగ్టన్: పోర్న్‌స్టార్ స్టోర్మీ డేనియల్స్ వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఆమెతో జరిగిన డీల్ గురించి తనకూ తెలుసని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీటర్‌లో ఆయన వరుస ట్వీట్లు చేశారు. డేనియల్స్‌తో శారీరక సంబంధం కొనసాగించిన కారణంగా ట్రంప్ ఆమెకు నగదు చెల్లించారంటూ న్యూయార్క్ మాజీ మేయర్ రుడీ గిలియాని వెల్లడించిన మరుసటి రోజే ట్రంప్ ఈ ట్వీట్లు చేయటం గమనార్హం.
‘ఇది ఎన్నికలతో ఏ మాత్రం సంబంధం లేని వ్యవహారం. నా లాయర్‌గా పనిచేసిన కోహెన్ ఆమెకు డబ్బు చెల్లించారు. వారిద్దరి మధ్య రహస్యంగా జరిగిన ఒప్పందం ఇది. ప్రైవేట్ ఒప్పందాలను బయటపెట్టాల్సిన అవసరం ఎవరికీ లేదు. సంపన్నుల మధ్య ఇలాంటివి సాధారణంగా జరుగుతుంటాయి. అంతేగానీ ఆమె ఆరోపిస్తున్నట్లు ఎలాంటి లైంగిక సంబంధం లేదు.’ అంటూ ట్రంప్ ట్వీట్లు చేశారు. అయితే ఈ వ్యవహారంలో ఎక్కడా తన ప్రమేయం ఉన్నట్లు ఆయన పేర్కొనకపోవటం విశేషం. ట్రంప్ తనతో కొంత కాలంపాటు(2006లో) లైంగిక సంబంధం నడిపారని, ఆ విషయం బయటపెట్టొద్దంటూ తన లాయర్ ద్వారా ఒప్పందం చేసుకున్నారంటూ ప్రకటించి డేనియల్స్ ప్రకంపనలు రేపారు. ఈ ఆరోపణలపై ట్రంప్ స్పందిస్తూ.. అవి వాస్తవం కాదని కొట్టిపారేశారు. ఇక ఇప్పుడు ఒప్పందం మాట వాస్తవమేనని చెప్పటంతో వ్యవహారం మరో మలుపు తిరిగేలా కనిపిస్తోంది.
2016 అధ్యక్ష ఎన్నికలకు ముందు లాయర్ కోహెన్ ద్వారా ట్రంప్ 1,30,000 డాలర్లకు ఈ డీల్ కుదిర్చారు. ఆపై కొన్ని నెలల తర్వాత ట్రంప్ ఆ నగదును కోహెన్‌కు ఇచ్చి వేశారు. అయితే అది ఆయన వ్యక్తిగత నగదో.. లేక ప్రభుత్వ ఖజానా నుంచి ఇచ్చారో తనకు తెలిదని రుడీ గిలియానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోర్న్‌స్టార్ ఎన్నికలకు పనిచేసి ఉంటే అది ప్రచారం చేసినందుకు ఇచ్చిన మొత్తంగా భావించవచ్చే వాళ్లమని.. కానీ, అలాంటిది జరగలేదంటూ రుడీ గిలియాని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ స్పందించినట్లు స్పష్టమౌతోంది.