
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన మాజీ సహాయకులు ఇద్దరు వేర్వేరు కేసుల్లో దోషులుగా తేలారు. 2016లో అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్‌తో సంబంధాలపై నోరెత్తకుండా ఉండేందుకు శృంగారతార స్టార్మీ డేనియెల్స్‌కు భారీగా చెల్లించినట్లు ట్రంప్ మాజీ లాయర్ మైకేల్ కోహెన్ మంగళవారం కోర్టులో అంగీకరించారు. మోసం కేసులో ట్రంప్ ఎన్నికల మాజీ ప్రధాన ప్రచారకర్త పాల్ మనాఫోర్ట్ కూడా దోషిగా తేలారు. ట్రంప్‌తో అక్రమ సంబంధాలకు సంబంధించి ఇద్దరు మహిళల నోరు మూయించిన కేసులో కోహెన్‌ను కోర్టు దోషిగా ప్రకటించింది.
పన్ను ఎగవేత, బ్యాంకుకు తప్పుడు సమాచారం ఇవ్వడం, ప్రచార సమయంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడటం తదితర కేసుల్లోనూ ఆయన దోషిగా తేలారు. అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న అభ్యర్థితో సంబంధాల గురించి బహిరంగంగా మాట్లాడి ఎన్నికలను ప్రభావితం చేయాలనుకున్న ఇద్దరు మహిళలకు 2.80 లక్షల డాలర్లు చెల్లించినట్లు కోహెన్ ఒప్పుకున్నారు. అధ్యక్ష పదవికి పోటీపడుతున్న అభ్యర్థి సూచనల మేరకే ఈ చెల్లింపులు చేసినట్లు తెలిపారు. ఇక్కడ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ కాగా, చెల్లింపులు స్వీకరించిన వారిలో ఒకరు డేనియల్స్, మరొకరు ట్రంప్ మాజీ శృంగార భాగస్వామి అని భావిస్తున్నారు. ఈ ఆరోపణల్లో లాయర్లు ట్రంప్ పేరును నేరుగా ప్రస్తావించకుండా ‘ఇండివిజువల్ 1’ అని పేర్కొన్నారు. కోహెన్‌కు శిక్షను డిసెంబర్ 12న ఖరారుచేయనున్నారు.
ముల్లర్‌కు విజయం..
మరోవైపు, ట్రంప్ మాజీ ప్రధాన ప్రచారకర్త మనాఫోర్ట్.. 5 పన్ను ఎగవేత కేసులు, రెండు బ్యాంకు మోసాల కేసులో, విదేశీ బ్యాంకు వివరాలు వెల్లడించడంలో విఫలమైన ఒక కేసులో దోషిగా తేలారు. మరో 10 కేసుల్లో తీర్పుపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో విచారణ సరిగా జరగలేదని జడ్జీలు పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై మాజీ లాయర్ రాబర్ట్ ముల్లర్ చేపట్టిన విచారణలో మనాఫోర్ట్, కోహెన్‌లు పాల్పడిన అవకతవకలు వెలుగుచూశాయి. విచారణను ముగించాలని తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న ముల్లర్‌కు తాజా పరిణామాలు గొప్ప విజయంతో సమానం. కోహెన్ దోషిగా తేలడంపై మాట్లాడేందుకు నిరాకరించిన ట్రంప్..పాల్ మనాఫోర్ట్ చాలా మంచి వ్యక్తి అని, ఆ కేసుతో తనకేం సంబంధం లేదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment