ఇటు భారత్.. అటు ఇరాన్.. పాక్‌కు డబుల్ షాక్
పాకిస్థాన్‌కు ఒకేసారి రెండు దెబ్బలు గట్టిగా తగిలాయి. ఒకవైపు భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్‌తో మతి పోగొడితే.. మరోవైపు పశ్చిమ సరిహద్దుల్లో ఇరాన్ సైన్యం పాకిస్థాన్‌పై దాడిచేసింది. ఇరాన్ బోర్డర్ గార్డ్స్ దళాలు సరిహద్దుల్లో కాల్పులు జరిపాయి. బలూచిస్థాన్ ప్రాంతంలోకి మూడు మోర్టార్లను ప్రయోగించాయి. దాంతో పాక్ దళాలకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇరానీ బోర్డర్ గార్డ్స్ పేల్చిన మోర్టార్ షెల్స్ పంజ్‌గూర్ జిల్లాలో పడ్డాయని బలూచిస్థాన్ రాష్ట్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. వాటిలో రెండు సరిహద్దు దళాల చెక్ పోస్టు సమీపంలో పడితే, మరొకటి కిల్లి కరీమ్ దాడ్ వద్ద పడిందని డాన్ పత్రిక అధికారులను ఉటంకిస్తూ పేర్కొంది.
అయితే మోర్టార్ల దాడి వల్ల ఆస్తినష్టం, ప్రాణనష్టం ఏమీ సంభవించలేదు. కానీ దాడి వల్ల స్థానికుల్లో మాత్రం తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. సరిహద్దు దళాల సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు. పాకిస్థానీ దళాలు పశ్చిమ సరిహద్దులలో కూడా మరిన్ని బలగాలను మోహరించాయి. పాకిస్థాన్‌కు ఇరాన్‌తో 900 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఆ సరిహద్దుల్లో కూడా పాకిస్థాన్ పదే పదే ఉగ్రవాద దాడులను ప్రోత్సహిస్తోందని ఇరాన్ ఆరోపిస్తోంది. ఇరు దేశాల సైనిక దళాలకు మధ్య ఇంతకుముందు కూడా ఇరానీ భూభాగంలో కాల్పులు జరిగాయి. సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టేయాలని ఇరాన్, పాకిస్థాన్ మధ్య 2014లో ఒక ఒప్పందం జరిగింది. అయినా ఫలితం లేకపోవడంతో ఇరాన్ కూడా దాడికి దిగింది.