మందు బాధలకు కాఫీయే మందు!
మీరు మద్యం ప్రియులా.. అదే సమయంలో మందు తాగితే లివర్ చెడిపోతుందని భయపడుతున్నారా? అయితే ఒక్క నిమిషం.. రోజూ నాలుగైదు కప్పుల కాఫీ తాగండి.. మీ లివర్ క్షేమంగా ఉంటుంది! బాగా మద్యం తాగడం వల్ల వచ్చే లివర్ సమస్యలకు చక్కటి మందు కాఫీయేనని పరిశోధకులు చెబుతున్నారు. రోజూ తాగేదాని కంటే రెండు కప్పుల కాఫీ అదనంగా తాగడం వల్ల లివర్ సిరోసిస్ వచ్చే ప్రమాదం 44 శాతం వరకు తగ్గినట్లు 4.30 లక్షల మంది మీద జరిపిన పరిశోధనల ఆధారంగా తేల్చి చెబుతున్నారు.
లివర్ సిరోసిస్ ఒక్కసారి వచ్చిందంటే దానికి చికిత్స దాదాపు అసాధ్యం. అందుకే అది రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని యూకేలోని సౌతాంప్టన్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ ఆలివర్ కెన్నడీ తెలిపారు. అందరికీ అందుబాటులో ఉండే మంచి కాఫీని రోజూ వాడే కోటా కంటే ఒకటి రెండు కప్పులు ఎక్కువగా తాగడం వల్ల లివర్ సిరోసిస్ వచ్చే ప్రమాదం 44 శాతం తగ్గడం ఖాయమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతియేటా దాదాపు 10 లక్షల మంది లివర్ సిరోసిస్‌తో మరణిస్తున్నారు. ఇది ప్రధానంగా హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు, అతిగా మద్యం తాగడం, ఇమ్యూన్ డిజార్డర్లు, ఫాటీ లివర్ డిసీజ్‌ల వల్ల వస్తుంది.