ఒబామాకు దుబాయ్‌లో ఉద్యోగం ఆఫర్
అమెరికా అధ్యక్షుడిగా త్వరలో పదవీ విరమణ చేయబోతున్న బరాక్ ఒబామా.. ఆ తర్వాత ఏం చేస్తారు? ఎటూ ఖాళీగా ఉంటారు కదా అని ఆయనకు దుబాయ్‌లో ఉద్యోగం ఇస్తానంటూ ఓ లాయర్ ఆఫర్ చేశాడు. తన లా కంపెనీలో ఉద్యోగం ఇస్తానని, దానివల్ల ఇస్లాం మతంపైన, సహనంపైన ఆయనకు మరింత అవగాహన వస్తుందని ఆ లాయర్ అన్నాడు. ఇస్లాం పట్ల సహనం అంటే అర్థం ఏంటో మరింత బాగా తెలుసుకోడానికి ఈ ఉద్యోగం ఆయనకు ఉపయోగపడుతుందని ఎమిరేటీ లాయర్ ఎయిసా బిన్ హైదర్ ట్వీట్ చేశారు. మంగళవారం నాటికి ఒబామా పదవీ కాలం ఇంకా 247 రోజులు ఉంటుంది. కొత్త అధ్యక్షుడు 2017 జనవరి 20వ తేదీన పదవీ స్వీకారం చేయాల్సి ఉంటుంది.
ఆయనకు జీతంతో పాటు ఉండేందుకు ఇల్లు, అరబ్ దేశాలు తిరిగి రావడానికి టికెట్లు కూడా ఇస్తానని ఆ లాయర్ ఆఫర్ చేశారు. అమెరికన్, పాశ్చాత్య మీడియా ఎప్పుడూ ఇస్లాంను ఉగ్రవాదానికి ప్రతిరూపంగా చిత్రీకరిస్తున్నాయని ఆయన అన్నారు. అయితే అది పూర్తి అవాస్తవమని... ఇస్లాం అంటేనే సహనానికి, క్షమాగుణానికి, అర్థం చేసుకోడానికి మారుపేరని చెప్పారు. పాశ్చాత్యులు ఇస్లాంను అర్థం చేసుకుని, ఆమోదించడానికి ఏకైక మార్గం వాళ్లొచ్చి తమతో కలిసి ఉండటమేనని, ఒబామా వైట్‌హౌస్‌ను వదలగానే ఆయనకు తన సంస్థలో ఉద్యోగం ఆఫర్ ఇస్తానని తెలిపారు. అరబ్బులు, ముస్లింలతో కలిసి ఉంటే ఆయనకు సహనానికి అసలైన అర్థం తెలుస్తుందని చెప్పారు.