టీవీ యాంకర్ అరెస్టు.. దేశ బహిష్కరణ
ఈజిప్టు: ప్రభుత్వ విధానాలు ఎండగడుతున్నారనే కారణంతో ఈజిప్టు అధికారులు ఓ టీవీ కార్యక్రమ ప్రముఖ నిర్వాహకురాలిని అరెస్టు చేసి ఆమెపై బహిష్కరణ వేటు వేశారు. ముందస్తుగా ఎవరికి సమాచారం తెలియజేయకుండా ఇంటి నుంచి ఆమెను గుర్తు తెలియని ప్రాంతానికి తరలించి అనంతరం ఓ ఫ్లైట్ ద్వారా బీరుట్ కు పంపిస్తున్నట్లు చెప్పారు. ఇదేమిటని అడిగిన వారికి ఆమె ఈజిప్టులో ఉండాల్సిన సమయం పూర్తయిందని, అనుమతికి మించిన రోజులు ఉండటం వల్లే అరెస్టు చేశామని చెప్పింది. లిలియానే దౌద్ అనే లెబనాన్ మహిళ ఆన్ టీవీ అనే చానెల్లో ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
ఈ కార్యక్రమం ప్రభుత్వానికి తలనొప్పిగా మారడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ప్రభుత్వం భావ ప్రకటన స్వేచ్ఛ పేరిట ఆమె ఇష్టం వచ్చినట్లు చేస్తూ హద్దు మీరిందని చెప్పారు. ఇంటివద్ద ఉన్న ఆమె పదేళ్ల కుమార్తె చెప్పిన ప్రకారం పాస్ పోర్టు అధికారుల పేరిట వచ్చిన వారు లిలియానేకు అరెస్టు చేశారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారని అడిగినా తొలుత చెప్పలేదు. ఇది ప్రభుత్వం చేసిన దుర్ణీతి అని, భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోవడమే అని ఆమె తరుపు న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అర్థరాత్రి సమయంలో ఆమె అరెస్టును ఈజిప్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. అక్కడి నుంచి ఆమెను బీరుట్కు పంపిస్తామని తెలిపింది. గడువు ముగిసినందున ఇక బహిష్కరణ తప్పదని చెప్పారు.