దుబాయ్: అబుదాబి ‘బిగ్ టికెట్ లక్కీ డ్రా’లో భారతీయులకు జాక్‌పాట్ తగిలింది. ఈ లక్కీ డ్రా వరించిన 10 మంది విజేతలల్లో 8 మంది భారతీయులు భారీ మొత్తం గెల్చుకున్నారు. ఒక్కొక్కరు రూ. కోటి 70 లక్షల (2.7లక్షల డాలర్లు) ప్రైజ్‌మనీ దక్కించుకున్నారు. విజేతల్లో ఒక కెనడియన్, పిలిప్పీన్ దేశస్థులు మినహా మిగతా వారంతా భారతీయులే కాగా ఓ మహిళా కూడా ఉంది. యూఏఈ రాజధానిలో ప్రతినెలా లగ్జరీ కార్ల, ప్రైజ్‌మనీ లక్కీ డ్రా నిర్వహిస్తారు. ఇటీవల అబుదాబి అంతర్జాతీయ విమాన కేంద్రంలో నిర్వహించిన లక్కీ డ్రాలో భారతీయుల పంట పండింది. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు చేతులకు రావడంతో విజేతలు అమితాశ్చర్యానికి గురయ్యారు. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
‘ప్రస్తుతానికి నాకు ఎలాంటి ప్రణాళికలు లేవు. చాలా ఎగ్జైట్‌గా ఉంది. డబ్బులు ఎలా ఖర్చు చేయాలో ఆలోచిస్తున్నా’ అని చంద్రేశ్ మోతివారస్ అనే విజేత తెలిపారు. తనకు తొలిసారి కాల్ వచ్చినప్పుడు నమ్మలేదని, ఆటపట్టించడానికే స్నేహితులు ఎవరో ఇలా చేస్తారనుకున్నానని, రెండోసారి నిర్వహకులు ఫోన్ చేసినపుడు షాక్ గురయ్యానని అభయ కుమార్ క్రిష్ణన్ అనే మరో విజేత పేర్కొన్నారు. ‘ఈ డబ్బును నేను నా స్నేహితునితో పంచుకుంటా. మేమిద్దరం కలిసే ఈ టికెట్ కొన్నాం. కొంత డబ్బు కేరళలోని చారిటీలకు ఇచ్చేస్తామ’ని మరో విజేత చెప్పుకొచ్చారు. గత పది ఏళ్ల నుంచి టికెట్లు కొంటున్నా. కానీ ఈ లక్కీ డ్రా తీసే రోజు మాత్రం తనకు గుర్తులేదని ఇంకొక విజేత తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment