నాలుగు గంటల్లోనే ట్రక్కు తయారు చేయొచ్చు!
డ్రైవర్ రహిత వాహనాన్ని తయారు చేయాలని చాలామంది ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాని ఇన్నాళ్లకు ఆ కల నెరవేరే టైమ్ దగ్గరపడింది. ప్రస్తుతం డ్రైవర్ లేకుండా నడిచే వాహనాన్ని ఇంగ్లండ్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ మేరకు డ్రైవర్ రహిత ట్రక్ డిజైన్లను లండన్‌లో జరిగిన ఓ కాన్ఫరెన్స్‌లో ఆవిష్కరించారు. తేలికపాటి మెటీరియల్, ఇంజన్‌ను ఉపయోగించడం వల్ల వాహనం బరువు కూడా చాలా తక్కువగా ఉంటుంది. అన్నీ అనుకూలిస్తే 2020లోగా లండన్‌లోని రోడ్లపై ఈ వాహనాలు తిరుగుతాయని తయారీదారులు ధీమాగా చెబుతున్నారు.
ఇవి ఎలాగూ ఎలక్ట్రిక్ వాహనాలు కావడంతో హానికర ఉద్గారాలు వెలువడవు. ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే వీటిని ఒక్క వ్యక్తి కేవలం నాలుగు గంటల్లోనే తయారు చేయగలడు. భవిష్యత్తులో సరుకుల రవాణాకు ఇవి చక్కగా ఉపయోగపడుతాయి. ఈ ట్రక్కుల తయారీ కోసం వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో కర్మాగారాన్ని నిర్మించే పనిలో పడ్డారు తయారీదారులు. ఈ వాహనాలు తొలి 100 మైళ్లు ఎలాంటి ఉద్గారాలు లేకుండా సాగుతాయి. ఆపై బ్యాటరీ డ్యూయల్ మోడ్ దానంతట అదే యాక్టివేట్ అయి 500 మైళ్ల వరకు ప్రయాణం చేస్తాయట. ఆక్స్‌ఫర్డ్‌లోని చార్జ్ ఆటోమోటివ్ అనే కంపెనీ దీనిని తయారు చేస్తోంది.