బంగారం కోసం వెళ్లి 11 మంది మృతి
జకార్తా: బంగారం కోసం అక్రమంగా తవ్వకాలు జరుపుతున్న 11 మంది సజీవ సమాధి అయిన ఘటన ఇండొనేషియాలో చోటుచేసుకుంది. సుమత్రా దీవిలో ఎలాంటి అనుమతులు లేకుండా సుమారు 50 మీటర్ల లోతులో బంగారం కోసం తవ్వకాలు జరుపుతుండగా ప్రమాదం జరిగింది. భారీ వర్షం కురవడంతో గనిలోకి మట్టి కూరుకుపోయింది. 21 నుంచి 55 ఏళ్ల మధ్య వయసున్న 11 మంది సజీవ సమాధి అయ్యారని వీరిలో ఎవరూ బ్రతికే అవకాశం లేదని స్థానిక పోలీసు అధికారి ట్రెస్నాడి వెల్లడించారు. మృతదేహాలను వెలికితీసేందుకు సహాయక బలగాలు ప్రయత్నిస్తున్నాయి.
బంగారం ధరకు రెక్కలొచ్చిన నేపథ్యంలో ఇండొనేషియాలో అక్రమ బంగారు గనుల సంఖ్య పెరిగిపోయింది. గత ఏడాది అక్టోబర్లో జావా దీవిలో నిరుపయోగంగా ఉన్న బంగారు గనిలోకి బంగారం కోసం వెళ్లిన 12 మంది మృతి చెందారు.