రికార్డు స్థాయిలో సీట్లను పెంచిన ఎమిరేట్స్
ఇప్పటికే ప్రపంచంలోనే అధికశాతం ప్రయాణీకులను తరలించే విమానంగా పేరొందిన ఎమిరేట్స్ మరో కొత్త రికార్డును నెలకొల్పింది. ఇప్పటిదాకా ఏ విమానంలోనూ లేనన్నిఅత్యధిక సీట్లను కలిగిన విమానంగా 615 సీట్లను ఏర్పాటు చేసి... ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మొదటి తరగతిని పూర్తిగా తొలగించి, మొత్తం రెండే తరగతులతో, ప్రత్యేక సౌకర్యాలతో ప్రయాణీకులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త A380 ఎమిరేట్స్ ఎయిర్ బస్... ఎకానమీ క్లాస్ లో ఒక్కో వరుసలో పది సీట్లు చొప్పున, 13 వరుసలతో మొత్తం 130 సీట్లను పెంచింది. ఎకానమీ క్లాస్ లో 557 సీట్లు, బిజినెస్ క్లాస్ లో 58 సీట్లు పెంచుతూ ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఈ ప్రత్యేక చర్యలతో ఇంతకు ముందు మూడు తరగతుల ప్రయాణీకులతో ఉండే విమానం కంటే ఇప్పుడు మరో 98 మంది ప్రయాణీకులను అధికంగా తరలించే అవకాశాన్ని కల్పించింది.
సీట్లను పెంచడంలో భాగంగా ఎకానమీ క్లాస్ లోని ప్రయాణీకులు ఏ విధంగానూ నష్టపోవాల్సిన అవసరం లేదని.... ఫస్ట్ క్లాస్ భాగంలోని ఖాళీగా ఉన్న స్థలాన్ని వినియోగించి అదనంగా బిజినెస్ క్లాస్ లో 18 పడకల సీట్లను పెంచినట్లు సంస్థ వెల్లడించింది. బిజినెస్ క్లాస్ లో మాత్రం పూర్తి శాతం సౌకర్యాలతో ఫ్లాట్ సీట్లును ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో బిజినెస్ క్లాస్ ప్రయాణీకులు మరింత ఆనందంగా ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించింది. ఈ కొత్త ఏర్పాట్లలో భాగంగా ప్రయాణీకులు.. కానాప్స్.. పానీయాలతో ఆన్ బోర్డ్ లాంజ్ ను కూడ ఎంజాయ్ చేయగలిగే అవకాశం ఉంది. దీనితో పాటు ఎమిరేట్స్ ఎకానమీ క్యాబిన్ కూడ ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఓ చిన్న గ్రామంలో ఉండేటంత జనంతో ఈ దుబాయ్ కి చెందిన ఎయిర్ లైన్స్ విమానం తన ప్రత్యేకతను చాటుతోంది.