
ఏథెన్స్ : ఆలస్యం అమృతం విషం.. ఇది సాధారణంగా అందరూ చెప్పే మాటే కానీ! ఆ ఆలస్యమే ఓ వ్యక్తి పాలట అమృతమైంది.. అతన్ని చావునుంచి తప్పించుకునేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. అడిస్ అబాబా నుంచి కెన్యా రాజధాని నైరోబి బయల్దేరిన బోయింగ్ 737–8 మ్యాక్స్ విమానం ఆదివారం ఇథియోపియా వద్ద కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 157 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఒక వ్యక్తి మాత్రం అదృష్టం కొద్ది.. కాదు కాదు ఆలస్యం కొద్ది ప్రాణాలతో బయటపడగలిగాడు. అతడే గ్రీకుకు చెందిన ఆంటోనిస్ మావ్‌రోపోలస్. ఆంటోని ‘‘ఇంటర్‌నేషనల్ సాలిడ్‌వేస్ట్ అసోషియేసన్’’ అనే ఓ స్వచ్ఛంద సంస్థకు అధ్యక్షుడు. యూఎన్ నిర్వహించే ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి నైరోబికి టిక్కెట్ బుక్ చేసుకున్నాడు.
ఆదివారం ఆంటోనితో కలిపి 150మంది ప్రయాణికులతో విమానం బయలుదేరాల్సిఉంది. కానీ ఆంటోని ఆలస్యం చేయటం వల్ల 149 మంది ప్రయాణికులతోటే విమానం నైరోబి బయలుదేరింది. అనంతరం ప్రమాదానికి గురై అందులో ఉన్న వారందరూ మరణించారు. ఆలస్యం కారణంగా ఎయిర్ పోర్టు అధికారులతో చివాట్లు తిన్న ఆంటోని మాత్రం క్షేమంగా మిగిలాడు. ఈ సంఘటనపై ఆంటోని స్పందిస్తూ.. ‘‘ఆ రోజు నేను విమానాశ్రయానికి తొందరగా వెళ్లాలని చాలా ప్రయత్నించాను. కానీ నాకెవ్వరూ సహాయం చేయలేదు. అప్పుడు నాకు పిచ్చిపట్టినట్లైంద’’ని తెలిపాడు. విమానం కూలిపోయిందన్న విషయం తెలుసుకుని మొదట బాధపడ్డా తను ఆ విమానంలో లేనందుకు సంతోషించాడు. తన ఫేస్ బుక్ పేజీలో ‘‘ మై లక్కీ డే’’ అని ఫోటోలను ఉంచి ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment