
పక్షుల కంటే ముందే.. రాక్షసబల్లుల గగన విహారం!
భూమిపై పక్షులు గాలిలో ఎగరడం నేర్వక ముందే.. రాక్షసబల్లులు (డైనోసార్లు) గగన విహారం చేసేవట! రాక్షసబల్లి అనగానే మనకు జురాసిక్ పార్కు సినిమాలో భారీ కాయంతో తిరుగుతూ భీకరంగా అరిచే జంతువులే గుర్తుకొస్తాయి. కానీ.. రాక్షసబల్లుల్లో నాలుగు, ఐదు అడుగుల బుల్లి జంతువులు కూడా ఉండేవి. ఆ బుల్లి జాతుల్లో ఒకటైన చాంగ్‌యురాప్టర్ యాంగై అనే రాక్షసబల్లులు ఆకాశంలో పక్షుల్లా స్వేచ్ఛగా తిరిగేవని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు అంటున్నారు. చిత్రంలో కనిపిస్తున్న చాంగ్‌యురాప్టర్ యాంగై అనే ఈ డైనోసార్ శిలాజంపై అధ్యయనంలో ఈ సంగతి వెల్లడైంది.
చైనాలోని లియావోనింగ్ ప్రావిన్స్‌లో కనుగొన్న ఈ శిలాజం 12.5 కోట్ల ఏళ్ల నాటిదట. నాలుగు అడుగుల పొడవు, నాలుగు కేజీల బరువు ఉన్న ఈ రాక్షసబల్లికి ఈకలతో కూడిన పొడవైన తోక, రెండు రెక్కలతోపాటు కాళ్లకు కూడా పొడవైన ఈకలు ఉండేవట. ఇలా రెక్కలకు, కాళ్లకు కూడా ఈక లు ఉండటం వల్ల ఇవి ఎగరగలిగేవని, పొడవైన తోక ఉండటం వల్ల బరువును, వేగాన్ని నియంత్రించుకుని ఇవి సురక్షితంగా దిగిపోయేవని అంటున్నారు. అలాగే పక్షుల మాదిరిగా ఈ డైనోసార్ ఎముకలు కూడా బోలుగా ఉండేవని అందువల్ల ఎగురుతున్నప్పుడు వాటి బరువు కూడా తగ్గిపోయేదని చెబుతున్నారు