
తలుపు తెరవగానే అనుకోని అతిథి
పొద్దున్నే నిద్ర లేవగానే తలుపు చప్పుడైతే ఇంత పొద్దున్నే వచ్చి డిస్ట్రబ్ చేసేది ఎవరని విసుక్కుంటాం. కానీ అమెరికాలోని సౌత్ కరొలినా ప్రాంతంలోని మౌంట్ ప్లెజెంట్‌లో ఉండే కుటుంబానికి మాత్రం అలా విసుక్కునే అవకాశం కూడా రాలేదు. పొద్దున్నే ఇంటి తలుపు బయట వాళ్లకు ఏదో శబ్దం వినిపించింది. ఎవరైనా దొంగలు తలుపు పగలగొట్టుకుని లోపలకు వద్దామని అనుకుంటున్నారా అన్న అనుమానం వచ్చింది. కానీ జాగ్రత్తగా తలుపు తీసి చూస్తే.. అక్కడో పెద్ద మొసలి నోరు తెరుచుకుని కనిపించింది. తన కూతురు మేడ మీద ఉంటుందని, ఆమె కిందకు దిగి ఉంటుందని తాము అనుకున్నామని.. తన కూతురేమో తన భార్య బయటకు వచ్చి ఉంటుందని అనుకుందని, కానీ చివరకు ఇద్దరూ కాకుండా తొమ్మిది అడుగుల పొడవున్న మొసలి కనిపించేసరికి గుండె ఝల్లుమందని ఇంటి యజమాని స్టీవ్ పాల్స్టన్ చెప్పారు.
15 అడుగుల ఎత్తున్న మెట్లను కూడా ఎక్కేసి మరీ ఆ మొసలి ఇంటి వరకు వచ్చింది. దారిలో ఒక అద్దాన్ని కూడా పగలగొట్టింది. రెండో అంతస్తులో ఉన్న ఇంటికి వచ్చి.. అక్కడ తలుపు దగ్గర ఒకటే గొడవ చేయడం మొదలుపెట్టింది. అక్కడి నుంచి దాన్ని తరిమేయడానికి ఎంత ప్రయత్నించినా అది మాత్రం కదలకపోగా.. మరింత కోపంగా కనిపించింది. నోరు బార్లా తెరిచి కనిపించినవాళ్లను తినేస్తానన్నట్లు చూసింది. దాంతో దిక్కుతోచని ఆ కుటుంబ సభ్యులు వన్యప్రాణి నిపుణులను పిలిపించారు. ఆ మొసలికి సుమారు 60 ఏళ్ల వయసుంటుందని వచ్చిన నిపుణులు చెప్పారు. ఎన్ని గంటలు ప్రయత్నించినా అది ఎవరికీ లొంగలేదు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో వన్యప్రాణి నిపుణులు దాన్ని చంపేశారు.