చరిత్రలో నిలిచిపోయిన 'ఆత్మీయ ఆలింగనం'
మంచి మిత్రుల మధ్య అనుబంధాన్నే కాకుండా రెండు దేశాల మధ్య మైత్రీబంధాన్ని కూడా ఆత్మీయ ఆలింగనం సూచిస్తుందనడంలో సందేహం లేదు. నాడు క్యూబా దేశాధినేతగా భారతకు వచ్చిన వీర విప్లవ యోధుడు ఫెడల్ క్యాస్ట్రో, నాడు ధీర వనితగా గుర్తింపు పొందిన నాటి భారత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీని ఆత్మీయ ఆలింగనం చేసుకోవడం రెండు దేశాల స్నేహ సంబంధాల చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది. నాడు ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా అలీన దేశాల్లో ఆ ఫొటో చెరగని ముద్ర వేసింది.
ఈ అరుదైన ఇరు దేశాధినేతల ఇద్దరి ఆత్మీయ ఆలింగన సన్నివేశం 1983లో ఢిల్లీ విజ్ఞానభవన్‌లో జరిగిన అలీనోద్యమ సదస్సు (నామ్) వేదికపై చోటు చేసుకొంది. అంతకుముందు నామ్ సదస్సు 1979లో క్యూబా రాజధాని హవానాలో జరిగింది. అందుకని ముందుగా క్యూబా అధ్యక్షుడు కాస్ట్రో మాట్లాడుతూ సదస్సు అధ్యక్ష బాధ్యతలను తన సోదరి ఇందిరాగాంధీకి గర్వంగా అప్పగిస్తున్నానంటూ సభ వేదికపై నిలబడ్డారు. అదే సమయంలో సభా వేదికపై ఆసీనులైన వందకుపైగా ప్రపంచ దేశాధినేతలు హర్షధ్వానాలు చేస్తుండగా ఇందిరాగాంధీ లేచి వేదిక ముందుకు వచ్చారు
.
మర్యాదపూర్వకంగా చేతిని కలిపేందుకు ఇందిరాగాంధీ చేతిని ముందుకు చాపారు. ఫెడల్ క్యాస్ట్రో అందుకు స్పందించలేదు. చిరునవ్వుతో చూస్తున్నారు. కాస్త ఇబ్చంది పడిన ఇందిరాగాంధీ కరచాలనం కోసం మరోసారి చేతిని ముందుకు చాపారు. రెండోసారి కూడా క్యాస్ట్రో స్పందించకపోవడంతో గాంధీ మరీ ఇబ్బందిపడ్డారు. తనవైపే చూస్తూ నవ్వుతున్న క్యాస్ట్రో ఎందుకు స్పందించడం లేదు? తనను ఆట పట్టిస్తున్నారా లేక అవమానిస్తున్నారా ? అన్న సందిగ్ధావస్థలో మూడోసారి చేతిని చాపనా, వద్దా అన్న సంశయంలో ఇందిరాగాంధీ కొట్టుమిట్టాడుతుండగా అనూహ్యంగా క్యాస్ట్రో చేతులు చాపి ఇందిరను దగ్గరికి తీసుకొని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఆ ఆజానుబాహుడి చేతుల్లో చిట్టి చెల్లెల్లా ఇందిరాగాంధీ ఒదిగిపోయారు. ఒక్కసారిగా వేదికపై నవ్వులు విరజిమ్మాయి. ఇందిరాగాంధీ కళ్లు ఆనందంతో చెమ్మగిల్లాయి. ఆ సన్నివేశం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది.