
నోట్లో వేలు.. ఎంతో మేలు !
వెల్లింగ్టన్ : ‘ఒరేయ్ నోట్లో వేలు తీయ్..ఇదేం అలవాటు’? చిన్న పిల్లలు ఉన్న ప్రతీ ఇంట్లో ఇది పాపులర్ డైలాగే ! నోట్లో వేలు పెట్టుకుని పిల్లలు కనిపిస్తే వారిని తల్లిదండ్రులు మందలించడం షరామామూలే..అయితే నోట్లో వేలు పెట్టుకోవడమేమీ చెడ్డ అలవాటు కాదని అంటున్నారు శాస్త్రవేత్తలు. గోర్లు కొరకడం, బొటనవేలు నోట్లో పెట్టుకునే పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుందట!
ఈ అలవాట్లు పెరిగే క్రమంలో దీర్ఘకాలంలో అలర్జీలు రాకుండా కాపాడుకునే అవకాశం ఉంటుందని ఒటాగో యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది. ఇంట్లోని దుమ్ము, ధూళి, కుక్క, పిల్లిలాంటి పెంపుడు జంతువుల వెంట్రుకల ద్వారా వచ్చే అలర్జీల నుంచి కాపాడుకునేందుకు సరిపడే శక్తి నోట్లో వేలు పెట్టుకోవడంతో వస్తుందని శాస్త్రవేత్తలు వివరించారు.