పారిస్ దాడి; ఇద్దరు ముష్కరుల గుర్తింపు
పారిస్ : పారిస్ లో ఉగ్రవాద దాడి ఘటన విచారణలో ఫ్రెంచ్ పోలీసులు మరో అడుగు ముందుకేశారు. ప్రపంచ వ్యాప్తంగా అలజడి రేపిన ఈ కాల్పులకు ఘటనకు పాల్పడిన ఇద్దరు జిహాదీలను గుర్తించినట్టు పోలీసులు ప్రకటించారు. ఓ అనుమానితుడి ఫోటోను పోలీసులు విడుదల చేశారు. భీకరమైన కాల్పుల అనంతరం ఆత్మాహుతిదాడికి పాల్పడ్డవారిలో అహ్మద్ అల్ ముహ్మద్ (25) , ఒమర్ ఇస్మాయల్ ముస్తఫా(29) ఉన్నారని గుర్తించారు. వీరిద్దరూ బాటాక్లాన్ కాన్సర్ట్ హాల్ దగ్గర దాడిచేసిన ముష్కరులుగా అనుమానిస్తున్నారు.
గత వేసవిలో అహ్మద్ అల్ ముహ్మద్ సిరిమా నుంచి టర్కీకి చేరుకున్నట్టు భావిస్తున్నారు. సిరియా నుంచి టర్కీ మీదుగా గ్రీస్ కు చేరి అక్కడి నుంచి దాడులకు పథక రచన చేసినట్టు పోలీసుల భావిస్తున్నారు. ఈయూ నిబంధనలకు లోబడి శరణార్థిగా అతడు గ్రీస్ చేరినట్టు గుర్తించామని గ్రీస్ అధికారి నికోస్ చెప్పారు. పారిస్ లో అతని వివరాలను పరిశీలించినదీ లేనిదీ తెలియదన్నారు. పారిస్ లో దాడి జరిగిన ప్రాంతంలో ఓ మృతదేహం దగ్గర.. గ్రీస్ శరణార్థిగా నమోదైన సిరియాకు చెందిన ఓ వ్యక్తి పాస్ పోర్ట్ దొరికినట్టు ఫ్రెంచ్ పోలీసులు చెబుతున్నారు. ఈ దాడుల్లో పాల్గొన్న ముష్కరుల్లో ఒకర్ని పోలీసులు కాల్చి చంపగా, మిగిలిన ఏడుగురు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.