ఏంజెల్ పెరెజ్
న్యూజెర్సీ : మాంసం తినే బ్యాక్టీరియా పీతల వేటగాడి పాలిట శాపంగా మారింది. శరీరంలోని భాగాలను కొద్ది కొద్దిగా తింటూ అతన్ని చావుకు దగ్గర చేస్తోంది. ఈ సంఘటన న్యూజెర్సీలోని మ్యాట్స్ ల్యాండింగ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. న్యూజెర్సీకి చెందిన ఏంజెల్ పెరెజ్ అనే పీతల వేటగాడు జూలై 2వ తేదీన మోరైస్ నదిలో వేటకు వెళ్లి పీతలు పట్టి ఇంటికి చేరుకున్నాడు. ఆ మరుసటి రోజు అతని కుడికాలు కొద్దిగా వాపుకు గురై బొబ్బలతో ఎర్రగా మారింది. అతడికి ఇదివరకే పార్కిన్‌సన్స్ అనే వ్యాధి ఉండటంతో కుటుంబసభ్యులు పెద్దగా పట్టించుకోలేదు. ఆస్పత్రిలో చేరినప్పటికి.. దాన్ని ఓ బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్‌గా భావించిన వైద్యులు ఏవో మందులు రాసి అతన్ని ఇంటికి పంపించారు.
కొద్ది రోజుల తర్వాత ఆ ఇన్‌ఫెక్షన్ పెరెజ్ రెండో కాలికి కూడా సోకింది. దీంతో మళ్లీ అతను ఆస్పత్రిలో చేరగా అతని పరిస్థితిని గమనించిన వైద్యులు ప్రత్యేకమైన పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో అసలు విషయం బయటపడింది. విబ్రియో అనే మాంసం తినే బ్యాక్టీరియా అతని శరీరంలోకి ప్రవేశించి కొద్ది కొద్దిగా అతని కాళ్లను తింటోందని తేలింది. ఆ ఇన్‌ఫెక్షన్ రెండు కాళ్లకు పూర్తిగా వ్యాపించి అతని ప్రాణానికే ముప్పగా మారింది. ప్రస్తుతం ఏంజెల్ పెరెజ్ 24గంటల అత్యవసర విభాగంలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment