
నాకు ఉన్న ఆస్తి వీడు. వయస్సు ఏడున్నర నెలలు. వీడిని మీరెలాగనైనా ఉపయోగించుకోవచ్చు.
ఫ్లోరిడా : ‘నాకు ఉన్న ఆస్తి వీడు. వయస్సు ఏడున్నర నెలలు. వీడిని మీరెలాగనైనా ఉపయోగించుకోవచ్చు. చెప్పండి ఎంతకు తాకట్టు పెట్టుకుంటారు. వీడి విలువ ఎంత’ అంటూ ఓ వ్యక్తి తన కుమారుడి గురించి షాపు వాళ్లతో బేరసారాలకు దిగాడు. ఇది గమనించిన ఓ షాపు యజమాని పోలీసులకు సమాచారమివ్వడంతో తాను ప్రాంక్ వీడియో రూపొందించేందుకే ఇలా చేశానంటూ తాపీగా సమాధానమిచ్చాడు. ఈ ఘటన ఫ్లోరిడా గల్ఫ్ కోస్ట్‌లో చోటుచేసుకుంది. వివరాలు... ఫ్లోరిడాకు చెందిన రిచర్డ్ స్లోకమ్ సింగిల్ పేరెంట్. అతడికి నెలల వయస్సు గల బాబు ఉన్నాడు. సరదాగా వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసే అలవాటు ఉన్న రిచర్డ్ ఓ రోజు కొడుకు వెంటేసుకుని ఓ షాపులోకి వెళ్లాడు. బాబు ఎంత విలువ చేస్తాడంటూ షాపు ఓనరును అడగటంతో అతడు అవాక్కయ్యాడు. అయితే తాను సరదాగా అన్నానని వెళ్లొస్తా అంటూ రిచర్డ్ షాపు నుంచి బయటికి వచ్చాడు. రిచర్డ్ ప్రవర్తనపై అనుమానం వచ్చిన షాపు యజమాని అతడి వెనకే వెళ్లగా.. మిగతా వాళ్లను కూడా ఇలాగే అడగటం గమనించాడు. దీంతో అతడు పోలీసులకు సమాచారమిచ్చాడు.
ఈ క్రమంలో షాపులోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా రిచర్డ్ కోసం పోలీసులు వెదకడం ప్రారంభించారు. అతడి గురించి వాకబు చేసేందుకు ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కంగుతిన్న రిచర్డ్ వెంటనే పోలీసు స్టేషనుకు పరిగెత్తాడు. తాను ప్రాంక్ వీడియో కోసమే ఇలా చేశానంటూ వివరణ ఇచ్చుకున్నాడు. దీంతో అతడి గురించి పూర్తి వివరాలు సేకరించిన తర్వాత పోలీసులు విడిచిపెట్టారు. ఈ విషయం గురించి షాపు యజమాని మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు ఇలాంటి పిచ్చి చేష్టలకు పాల్పడే వారికి సరైన శిక్ష విధిస్తేనే.. కుదురుగా ఉంటారంటూ రిచర్డ్ తీరుపై మండిపడ్డాడు. తాను ఇలాంటి విషయాలను తేలికగా తీసుకోలేనని, అందుకే పోలీసులకు ఫోన్ చేశానని చెప్పుకొచ్చాడు.