
అవ్వాతాతల కోసం ‘జెల్’ ఆహారం!
పళ్లూడిపోయి బోసినోటితో ఆహారాన్ని నమిలి మింగలేని బామ్మలు, తాతయ్యల కోసం జెల్ మాదిరిగా స్మూత్‌గా ఉండే ఆహార పదార్థాలను 3డీ ప్రింటింగ్ పద్ధతిలో తయారు చేసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఈ పద్ధతిలో తయారుచేసే చికెన్, క్యారెట్లు, పండ్లు వంటివాటిని నమలాల్సిన అవసరమే ఉండ దు. చూడటానికి మామూలు ఆహార పదార్థాల మాదిరిగానే కనిపించినా.. ఇవి స్మూత్‌గా, సుతిమెత్తని జెల్‌లా ఉంటాయి. ఉదాహరణకు ఓ తాతయ్యకు క్యారట్ తినాలనిపించిందనుకోండి.. తొలుత దానిని ఉడికించి, ముద్దలాచేసి దానికి రంగు, ఇతర పదార్థాలు కలుపుతారు.
తర్వాత దానిని 3డీ ప్రింటర్‌లో పోసి, క్యారట్ ముక్కల మాదిరిగా పొరలుపొరలుగా ముద్రిస్తారు. దీంతో రుచి మారకుండానే, సుతిమెత్తటి క్యారెట్ ముక్కలు రెడీ అన్నమాట. అలాగే చికెన్‌ను కూడా ముద్దలా చేసి చికెన్ ముక్కలు తయారు చేస్తారు. ఇంకేం.. వీటిని నోట్లో వేసుకుంటే గులాబ్‌జాముల్లా కరిగిపోతాయన్నమాట. ఈ సరికొత్త 3డీ ప్రింటింగ్ పద్ధతి అభివృద్ధికి యూరోపియన్ యూనియన్ నిధులు అందిస్తోంది. వృద్ధుల్లో పౌష్టికాహారలోపం నివారణకు ఈ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.