![EU Serious Comments On USA Donald Trump](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/Trump.jpg.webp?itok=JvhdMzeg)
అమెరికా టారిఫ్ విధింపును తప్పుబట్టిన ఈయూ
అంతకు తగ్గట్లే టారిఫ్‌లు పెంచే యోచనలో యూరప్ కూటమి
బ్రస్సెల్స్: అమెరికాలోకి దిగుమతి అయ్యే ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై 25 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన మరుసటి రోజే 27దేశాల యూరప్ కూటమి ఘాటుగా స్పందించింది.
అర్ధరహిత టారిఫ్‌లతో దుందుడుకుగా వ్యవహరిస్తున్న అమెరికా ప్రభుత్వానికి తగు సమాధానం చెప్తామని యూరోపియన్ యూనియన్ అధ్యక్షురాలు ఉర్సులావాన్ డీర్ లియాన్ మంగళవారం ప్రకటించారు. ఈ సందర్భంగా డీర్ లియాన్..‘ట్రంప్ టారిఫ్ సవాలుకు దీటుగా బదులిస్తాం. అవి చెడ్డ పన్నులు. వ్యాపారస్తులకూ చెడ్డవే. వినియోగదారులకు గుదిబండలు. యూరోపియన్ యూనియన్‌కు భారంగా మారిన ఈ టారిఫ్‌లకు దీటైన సమాధానం చెప్తాం’ అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇరువైపులా విపరిణామాలు
ఈయూ కూటమిలో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ అయిన జర్మనీ సైతం అమెరికా స్టీల్, అల్యూమినియంలపై టారిఫ్‌లు పెంచడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. దీనిపై జర్మనీ చాన్స్‌లర్ ఒలాఫ్ స్కోల్జ్ స్పందించారు. అమెరికా మాకు మరో ప్రత్యామ్నాయం లేకుండా చేస్తే యురోపియన్ యూనియన్ మొత్తం ఏకతాటిమీదకొచ్చి ఐక్యంగా నిలబడుతుంది. అప్పుడు అంతిమంగా ఆర్థికయుద్ధం మొదలై ఇరువైపులా దాని విపరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది’’అని ఒలాఫ్ వ్యాఖ్యానించారు. అయితే ఈయూ కూటమి ఏ స్థాయిలో టారిఫ్‌లు పెంచుతుందనే వివరాలు ఇంకా వెల్లడికాలేదు. అయితే ట్రంప్‌కు చెందిన రిపబ్లికన్ పార్టీ పాలిత రాష్ట్రాల నుంచి దిగుమతులపైనే ముఖ్యంగా టారిఫ్ పెంచాలని యోచిస్తున్నట్లు వాణిజ్యరంగ విశ్లేషకులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment