
తన తండ్రి, లంక మాజీ అధ్యక్షుడు మహీందతో యోషితా రాజపక్స(ఫైల్ ఫొటో)
క్రికెట్ ప్రసారాల కుంభకోణంలో శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహీంద రాజపక్స కుమారుడు యోషితా అరెస్టయ్యారు.
కొలంబో: క్రికెట్ ప్రసారాల కుంభకోణం శ్రీలంకలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నది. తమకు అనుకూలమైన సంస్థకు ప్రసార హక్కులు కట్టబెట్టారని, ఆమేరకు ఆర్థిక మోసాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆ దేశ మాజీ అధ్యక్షుడు మహీంద రాజపక్స కుమారుడు యోషితా రాజపక్సను శనివారం శ్రీలంక ఆర్థిక నేరాల విభాగం పోలీసులు అరెస్టుచేశారు.
మహీందా అధ్యక్షుడి ఉన్నకాలంలో శ్రీలంక జాతీయజట్టు పాల్గొనే క్రికెట్ మ్యాచ్ ప్రసార హక్కులను కార్ల్ టన్ నెట్ వర్క్ అనే సంస్థకు కట్టబెట్టారని, అంతకుముందు జాతీయ ఛానెల్ కు మాత్రమే ఉండే క్రికెట్ ప్రసార హక్కులను ప్రైవేట్ సంస్థకు బదలాయించడంలో యోషితా చక్రంతిప్పారని పోలీసుల వాదన. శ్రీలంక రగ్బీ జాతీయ జట్టుకు ఆడిన యోషితా స్పోర్ట్స్ కోటాలో శ్రీలంక నేవీలో లెఫ్టినెట్ గా ఉద్యోగం పొందారు. అరెస్టు నేపథ్యంలో ఆయన ఉద్యోగానికి రాజీనామాచేశారు.
'యోషితా సహా మరో నలుగురిని శనివారం అరెస్టు చేశామని, వారిలో సీఎస్ఎన్ సీఈవో నిశాంత రణతుంగ కూడా ఒకరని పోలీసులు వెల్లడించారు. నిందితులపై మనీలాండరింగ్ చట్టాల ప్రకారం కేసులు పెట్టామని, దర్యాప్తులో భాగంగా మరికొందరిని అరెస్ట్ చేస్తామని తెలిపారు.
10 ఏళ్లపాటు అధ్యక్షుడిగా పనిచేసిన మహీంద రాజపక్సే గతేడాది జనవరిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపాలవ్వడం, ఆయన దగ్గర మంత్రిగా పనిచేసి, తిరుబావుటా ఎగరేసిన మైత్రిపాల సిరిసేన నూతన అధ్యక్షుడిగా ఎన్నికకావటం తెలిసిందే. అధికారం చేపట్టిన మరుసటిరోజు నుంచి గత ప్రభుత్వాల అక్రమాలను వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న సిరిసేన ప్రభుత్వం.. మహీదా కుమారుడి అరెస్టుతో ఆ చర్యను మరింత వేగవంతం చేసినట్లు తెలుస్తున్నది.