హూస్టన్: పార్కిన్‌సన్ వ్యాధితో బాధపడుతున్న అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ హెర్బర్ట్ వాకర్ బుష్(94) శుక్రవారం కన్నుమూశారు. సీనియర్ బుష్‌గా పిలుచుకునే ఆయన 1989–1993 మధ్య కాలంలో అమెరికాకు 41వ అధ్యక్షుడిగా సేవలందించారు. నాటి అమెరికా విరోధి కూటమి సోవియెట్ యూనియన్ పతనం, కువైట్‌పై దురాక్రమణకు పాల్పడిన ఇరాక్ ఓటమిపాలవడం, జర్మనీ గోడ కూల్చివేత లాంటి చారిత్రక ఘటనలు ఆయన హయాంలోనే జరిగాయి. అదే కాలంలో పలు దేశాల్లో నియంతృత్వ పాలనకు తెరపడి స్వేచ్ఛావాద ప్రజాస్వామ్య వ్యవస్థలు మనుగడలోకి వచ్చాయి.
బుష్ అంత్యక్రియలు ఎప్పుడు నిర్వహించేది తరువాత ప్రకటిస్తామని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ‘ఉన్నత ప్రవర్తన కలిగిన మనిషి, ఒక బిడ్డ కోరుకునే అత్యుత్తమ తండ్రి’ అని ఆయన కొడుకు, మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ శ్లాఘించారు. మృతిపై భారత ప్రధాని మోదీ సహా వివిధ దేశాల నాయకులు విచారం వ్యక్తం చేశారు. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో బుష్ చెక్కుచెదరని నాయకత్వ పటిమను ప్రదర్శించారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. అమెరికా గొప్ప మార్గదర్శకుడు, విధేయుడైన సేవకుడిని కోల్పోయిందని మాజీ అధ్యక్షుడు ఒబామా అన్నారు.
ఎక్కువ కాలం బతికిన అధ్యక్షుడు..
1924 జూన్ 24న మసాచుసెట్స్‌లోని ధనవంతుల కుటుంబంలో జన్మించిన బుష్ ఈ ఏడాది 94 ఏళ్లు పూర్తిచేసుకున్నారు. దీంతో ఎక్కువ కాలం బతికి ఉన్న అమెరికా మాజీ అధ్యక్షుడిగా గుర్తింపు పొందారు. అమెరికాలోని పెరల్ హార్బర్‌పై జపాన్ దాడి తరువాత 18 ఏళ్ల ప్రాయంలోనే నేవీలో పైలట్‌గా నియమితులై, అత్యంత పిన్న వయసులో ఈ ఘనత సాధించిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. 1945లో బార్బరా పియర్స్‌ను పెళ్లాడారు. బార్బరా ఏప్రిల్‌లో చనిపోయారు. వారికి ఆరుగురు సంతానం. వారి కొడుకు జార్జ్ బుష్ జూనియర్ అమెరికాకు 43వ అధ్యక్షుడిగా పనిచేశారు. మాజీ అధ్యక్షుడు కెన్నడీ కుటుంబం తరువాత అమెరికా రాజకీయాల్లో ఎక్కువ పదవులు చేపట్టింది బుష్ కుటుంబమే. సీనియర్ బుష్ అంత్యక్రియలకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ హాజరవుతారని అధ్యక్ష భవనం వైట్‌హౌస్ శనివారం వెల్లడించింది.
‘అణు’ ముప్పు తప్పించారు
తన కుటుంబం స్థిరపడిన టెక్సాస్ నుంచి బుష్ రెండుసార్లు రిపబ్లికన్ పార్టీ తరఫున ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. 1971లో అప్పటి అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్..బుష్‌ను ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారిగా నియమించారు. 1980 ఎన్నికల్లో రొనాల్డ్ రీగన్ అధ్యక్షుడిగా ఎన్నికవడంతో బుష్ ఉపాధ్యక్షుడయ్యారు. ఈ జోడి 1984లోనూ గెలవడంతో బుష్ ఉపాధ్యక్షునిగా ఎనిమిదేళ్లు ఉన్నారు. తర్వాత రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీచేసి 1989లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1991, 93లలో రెండు కీలక వ్యూహాత్మక ఆయుధాల నియంత్రణ ఒప్పందాలపై సంతకం చేసి సీనియర్ బుష్ ప్రపంచానికి అణ్వాయుధ ముప్పును తప్పించారు.
ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(నాఫ్తా) రూపకల్పనకు తీవ్రస్థాయిలో సంప్రదింపులు జరిపారు. బుష్ అమెరికా అధ్యక్షుడుకాకముందు నావికా దళంలో పైలట్‌గా, నిఘా సంస్థ సీఐఏకు చీఫ్‌గా పనిచేశారు. 1990లో కువైట్‌పై యుద్ధానికి దిగిన ఇరాక్..సౌదీ అరేబియాలోకి కూడా చొరబడేందుకు యత్నించింది. అదే జరిగితే ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌కు ప్రపంచంలోని మొత్తం ముడి చమురు నిల్వల్లో 40 శాతం వశమయ్యేవి. ఈ ముప్పును గ్రహించిన సీనియర్ బుష్ 32 దేశాల సేనల్ని ఏకం చేసి ఇరాక్‌పై ముప్పేట దాడి ప్రారంభించారు. ఆపరేషన్ డెజర్ట్ పేరిట చేపట్టిన ఈ ఆపరేషన్‌తో సద్దాం సైన్యాన్ని తరిమికొట్టారు. 2011లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా నుంచి అమెరికా అత్యున్నత పౌర పురస్కారం ది ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్‌ను స్వీకరించారు.
84ఏళ్ల వయసులో బుష్ స్కైడైవింగ్(ఫైల్)
సీనియర్ బుష్ కన్నుమూత
Published Sun, Dec 2 2018 5:00 AM | Last Updated on Sun, Dec 2 2018 5:06 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment