ఈ రోడ్లు కరెంటు పుట్టిస్తాయి
ఈ రోడ్లు కరెంటు పుట్టిస్తాయి
Published Fri, Jan 27 2017 2:52 AM | Last Updated on Mon, Oct 22 2018 8:31 PM
ఒక్క దెబ్బకు బోలెడు పిట్టలు అంటే ఇదే. ఒకపక్క చాలా దేశాలు సోలార్ ప్లాంట్ల కోసం వందల వేల ఎకరాల భూమిని అప్పనంగా వాడేస్తూంటే.. ఫ్రాన్స్ నిశ్శబ్దంగా ఉన్న రోడ్లనే సౌరశక్తి ఉత్పత్తి కేంద్రాలుగా మార్చేస్తోంది. పక్క ఫొటోల్లో కనిపిస్తున్నది ఇటీవలే ప్రారంభమైన సోలార్ రోడ్లలో ఒకటి. పర్యావరణానికి ఏ మాత్రం హాని కలిగించని రీతిలో విద్యుత్తును ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో ఫ్రాన్స్ ఈ సూపర్ ఐడియాతో ముందుకెళుతోంది. వచ్చే ఐదేళ్లలో దేశంలోని కనీసం వెయ్యి కిలోమీటర్ల రహదారులను సోలార్ రోడ్స్‌గా అభివృద్ధి చేయాలని, తద్వారా 50 లక్షల మందికి అవసరమైన విద్యుత్తును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కోలాస్ అనే సంస్థ గత ఏడాది ‘వాట్టావే’ పేరుతో తయారు చేసిన ప్యానెళ్లను రోడ్లపై ఒక పక్క బిగించడం ద్వారా దీన్ని సుసాధ్యం చేస్తోంది.
అత్యంత పలుచటి సిలికాన్ ఫొటోవోల్టాయిక్ పాలీ క్రిస్టలీన్ పదార్థంతో తయారైన ఈ ప్యానెళ్లు భారీసైజు లారీల ఒత్తిడిని కూడా తట్టుకోగలవు. నున్నటి ఉపరితలంపై వాహనాలు జారిపోకుండా తగిన ఏర్పాట్లు కూడా చేశారు. ఒక్కో వాట్టవే ప్యానెల్ 20 ఏళ్లు లేదా పది లక్షల వాహనాల ప్రయాణాన్ని తట్టుకుంటున్నట్లు తమ పరీక్షల్లో వెల్లడైందని కోలాస్ సీఈవో హెర్వ్ లీ బౌచ్ అంటున్నారు. రోడ్లపై మంచు పేరుకుపోయినప్పుడు యంత్రాల సాయంతో దాన్ని తొలగించినా ప్యానెళ్లు చెక్కచెదరలేదని ఆయన చెప్పారు. రహదారిపై నాలుగు మీటర్ల పొడవైన సోలార్ ప్యానెళ్లు బిగిస్తే ఒక ఇంటికి సరిపడా విద్యుత్తు ఉత్పత్తి అవుతుందని, కిలోమీటర్‌కు 5000 కుటుంబాల అవసరాలు తీర్చవచ్చునని అంచనా. ఇంకో విషయం ఈ ప్రాజెక్టుకు నిధులు సేకరించేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం పెట్రోలు, డీజిళ్లపై అధిక పన్నులు విధించింది!
-సాక్షి నాలెడ్జ్ సెంటర్
Advertisement