
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రాన్
పారిస్ : సెల్‌ఫోన్ వ్యసనం బారి నుంచి పాఠశాల విద్యార్థులను రక్షించేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. పాఠశాలల్లో సెల్‌ఫోన్లపై నిషేధం విధించే బిల్లును జాతీయ అసెంబ్లీ(దిగువ సభ)లో ప్రవేశపెట్టింది. మెజారిటీ సభ్యులు ఈ బిల్లుకు మద్దతు తెలిపారు. దీంతో ఎగువ సభకు బిల్లును పంపించారు. అక్కడ కూడా బిల్లు ఆమోదం పొందినట్లైతే ఈ విద్యా సంవత్సరం(సెప్టెంబరు) నుంచే మొబైల్లపై నిషేధం అమలులోకి రానుంది. అయితే ఈ నిబంధనను పారిస్ వరకే పరిమితం చేయాలా లేదా దేశ వ్యాప్తంగా అమలు చేయాలా అనే అంశంపై ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని అసెంబ్లీ సభ్యులు తెలిపారు. కాగా దివ్యాంగ , విద్యా, సాంస్కృతిక కార్యకలాపాల కోసం సెల్‌ఫోన్లు, ట్యాబెట్లు ఉపయోగించే విద్యార్థులకు ఈ నిబంధన వర్తించదు. ఇందుకు సంబంధించి పూర్తి నియమావళిని రూపొందిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
90 శాతం విద్యార్థులు...
7 నుంచి 12 ఏళ్లలోపు చిన్నారుల్లో 90 శాతం మంది సెల్‌ఫోన్లను వినియోగిస్తున్నట్లు బిల్లులో పేర్కొన్నారు. స్మార్ట్‌ఫోన్ వాడకం వల్ల పిల్లలు సైబర్ ప్రమాదాల బారిన పడుతుండటం, పోర్న్‌సైట్లు చూసే కల్చర్ పెరిగి పోతుండటంతో కనీసం స్కూళ్లో అయిన నిషేధం అనివార్యమని పలువురు అసెంబ్లీ సభ్యులు అభిప్రాయపడ్డారు.
నిబద్ధత నిరూపించుకున్నా..
ఎన్నికల ప్రచారంలో భాగంగా విద్యార్థుల భవిష్యత్తు కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటానంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ వాగ్దానం చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ బిల్లు గురించి ప్రస్తావిస్తూ.. ‘స్కూళ్లు, కాలేజీల్లో మొబైల్లపై సాధారణ నిషేధం విధించే బిల్లుకు జాతీయ అసెంబ్లీలో పూర్తి మద్దతు లభించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ పూర్తైనట్లే. నా నిబద్ధత నిరూపించుకున్నా’ అంటూ మాక్రాన్ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment