పోలీసుల పహారాలో పారిస్
పారిస్లో జరగనున్న వాతావరణ సదస్సుకు ఫ్రాన్స్ భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ఉగ్రవాదుల మారణకాండ అనంతరం పారిస్ తొలిసారిగా ఆతిధ్యమిస్తున్న అత్యున్నత స్థాయి సదస్సు కావడంతో భద్రతను పెంచారు. ప్రపంచ దేశాలకు చెందిన అత్యున్నత స్థాయి ప్రతినిధులు వాతావరణ సదస్సులో పాల్గొననున్నారు. దీనికోసం 11,000 మంది అదనపు బలగాలను మోహరించినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 8,000 మంది సిబ్బందిని సరిహద్దు ప్రాంతాలలో భద్రత కోసం కెటాయించగా, మరో 3,000 మందిని ఉత్తర పారిస్లో సదస్సు జరిగే ప్రాంతంలో నిఘాకోసం ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
నవంబర్ 30న సదస్సు ప్రారంభం కానున్న సదస్సు డిసెంబర్ 11 వరకు కొనసాగనుంది. సదస్సు ప్రారంభ రోజున భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ కానున్నారు. ఈ సదస్సులో వాతావరణంలో వస్తున్నటువంటి విపరీత మార్పులను తగ్గించడానికి ప్రపంచ దేశాలు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.