
గ్యాంగ్‌స్టర్ రెడోని ఫెయిడ్
పారిస్ : అతడో గ్యాంగ్‌స్టర్.. పేరు రెడోనీ ఫేయిడ్.. ఎన్నో దొంగతనాలు, దోపిడీ, హత్య కేసుల్లో నిందితుడు.. పైగా తన తెలివితేటలతో ఎంతో చాకచక్యంగా జైలు నుంచి తప్పించున్నాడు కూడా. తాను ఇలా దొంగలా మారడానికి సినిమాలే స్ఫూర్తి అని చెప్పిన రెడోనీ ప్రస్తుతం సినీ ఫక్కీలోనే పోలీసులకు దొరికిపోయాడు.
అసలు విషయమేమిటంటే.. పారిస్‌కు చెందిన రెడోని ఫెయిడ్ 12 ఏట నుంచే దొంగతనాలు ప్రారంభించాడు. 20 ఏళ్లు వచ్చేనాటికే గజదొంగగా పోలీసు రికార్డుల్లోకెక్కాడు. ఎంతోమంది అనుచరగణం కలిగిన రెడోనిని పట్టుకోవడం పారిస్ పోలీసులకు సవాలుగా మారింది. ఈ క్రమంలో ఎట్టకేలకు 2013లో అతడిని అరెస్టు చేయగలిగారు పోలీసులు. కానీ కొద్దివారాలకే అతడు తప్పించుకోవడంతో వారి శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరే అయింది. అయినా పట్టు వదలకుండా మరోసారి ప్రయత్నించి విజయం సాధించారు. అయితే ఈసారి అతడిని తప్పించడానికి అనుచరగణం రంగంలోకి దిగింది. గత జూలైలో హెలికాప్టర్‌ను హైజాక్ చేసి మరీ కోర్టు యార్డులోనే దానిని నిలిపి రెడోనిని విడిపించారు. దీంతో జైళ్ల భద్రతా వ్యవస్థ ప్రమాణాలు ఇంత ఘోరంగా ఉంటాయా అంటూ ఫ్రాన్స్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
బుర్ఖా పట్టించింది..
జైలు నుంచి తప్పించుకున్న తర్వాత ఉత్తర పారిస్‌లోని క్రెయిల్ ప్రాంతంలో ఓ అపార్టుమెంట్‌లో బస చేశాడు రెడోని. అతడి మేనళ్లుల్లు, ఓ మహిళా డ్రైవర్ సాయంతో గత మూడు నెలలుగా అక్కడే తలదాచుకుంటున్నాడు. ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు బయటికి వెళ్లిన ప్రతిసారీ బుర్ఖా ధరించేవాడు. ఈ క్రమంలో స్థానిక పోలీసు ఒకరు ఈ విషయాన్ని గమనించారు. బుర్ఖా వేసుకున్న వ్యక్తి నడకతీరు మహిళలా ఉండకపోవడంతో అతడికి అనుమానం కలిగింది. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు. రెండు రోజులపాటు రిక్కీ నిర్వహించిన అనంతరం బుర్ఖాలో తిరుగుతున్న వ్యక్తి రెడోనినే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పక్కాగా ప్లాన్ చేసి బుధవారం రాత్రి అతడిని అరెస్టు చేశారు. కాగా ఈ ఆపరేషన్‌లో సుమారు వంద మంది పోలీసులు పాల్గొన్నారు. రెడోనీని అరెస్టు చేసిన తర్వాత అతడి డ్రైవర్(మహిళ) సాయంతో అతడి డెన్‌లో ఉన్న అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment