విశ్వాసాల ఆధారంగా అంత్యక్రియలు జరుగుతాయి. తనువు చాలించిన వారి కథ అంతటితో సమాప్తం! భూమిలో చేరి నశించిపోవడం.. లేదంటే కాలిపోయి గాల్లో కలిసిపోవడం! ఇప్పటివరకూ ఇదే జరిగింది. కానీ.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో గ్యారెంటీ లేదు! ఎందుకంటారా? లోకో భిన్న రుచి అన్నట్టు.. చావు తరువాత ఏం జరగాలన్నది మనమే ప్లాన్ చేసుకునే రోజులు వచ్చేశాయిమరి. –సాక్షి నాలెడ్జ్ సెంటర్
ఆకాశంలోకి అవశేషాలు...
అమెరికాలో మెసోలాఫ్ట్ అని ఓ కంపెనీ ఉంది. మనిషి అవశేషాలను అంతరిక్షంలోకి చేర్చడంలో గొప్ప ఎక్స్‌పర్ట్ ఇది. ఈ మధ్య కాలంలో పెరిగిపోతున్న ట్రెండ్‌కు అనుగుణంగా చనిపోయిన వారి చితా భస్మాన్ని 80 వేల అడుగుల ఎత్తుకు తీసుకెళ్లి వెదజల్లుతోంది ఈ కంపెనీ.
‘‘చచ్చిపోయిన వెంటనే భూమిలో పాతిపెట్టడం బోర్ కొట్టేస్తోంది. అందుకే ఇప్పుడు ఆకాశంలో కలిసి పోవాలనుకునే వాళ్లు ఎక్కువవుతున్నారు’’అంటారు మెలోసాఫ్ట్‌కు చెందిన అలెక్స్ క్లెమెంట్స్. అడ్రినో అనే మైక్రోకంప్యూటర్ సాయంతో గాలిబుడగలో బూడిదను పైకి పంపిస్తుంది. అక్కడ చెల్లాచెదురయ్యేలా చేస్తుంది. ఆ చివరి క్షణాలను వీడియోతీసి చనిపోయిన వారి బంధువులకు పంపుతుంది.
బుద్ధుడి సాంగత్యంలో...
జపాన్‌లో అంత్యక్రియలు ఖరీదైన వ్యవహారం. ఆరడుగుల నేల కాదు కదా.. 6 అంగుళాల జాగా కావాలన్నా చేతి చమురు వదులుతుంది. అందుకే అక్కడ ఒక కొత్త పోకడ మొదలైంది. కౌకు కుజి బౌద్ధ దేవాలయంలో ఓ హైటెక్ శ్మశానాన్ని ఏర్పాటు చేశారు. బ్యాంకు లాకర్ల వంటివి ఉంటాయి దీంట్లో.
చితాభస్మంతో కూడిన లాకర్.. ముందుభాగంలో అందమైన ఎల్‌ఈడీ లైట్లతో కూడిన బుద్దుడి విగ్రహం ఉంటాయి. మృతుల వివరాలన్నింటినీ స్మార్ట్‌కార్డ్‌లో నిక్షిప్తం చేసి అవసరమైనప్పుడు చూసుకునేలా ఏర్పాట్లు ఉన్నాయి. ఒక్కో లాకర్‌కు నాలుగు లక్షల రూపాయల వరకూ ఖర్చు అవుతుంది. ఏడాదికి ఐదువేల రూపాయల నిర్వహణ వ్యయం అదనం.
వజ్రాలుగా మార్చేస్తారు..
లైఫ్‌జెన్ అనే సంస్థ మానవ అవశేషాల నుంచి కార్బన్‌ను వేరు చేసి వజ్రాలుగా çమార్చేస్తోంది. భారీ యంత్రం సాయంతో విపరీతమైన వేడి, ఒత్తిడికి గురిచేసినప్పుడు కార్బన్ కాస్తా వజ్రంగా మారుతుంది. సాధారణ వజ్రాల స్థాయిలోనే ఇవి వెలుగులు చిమ్ముతాయి. ముడి వజ్రాన్ని చక్కగా ఒక ఆకారంలోకి తెచ్చి పాలిష్ చేసిన తరువాత దానిపై మృతుల తాలూకూ జ్ఞాపకాలను అక్షరాల రూపంలో చెక్కిస్తామని.. వీటితో తయారైన ఆభరణాలను ధరించడం ద్వారా ఆప్తులు మన దగ్గరే ఉన్న అనుభూతి పొందవచ్చంటోంది.
పగడపు దిబ్బల్లో ఒకటిగా...
పోతూ పోతూ ఈ భూమికి ఏదైనా మేలు చేయాలన్న ఆలోచన ఉన్నవారికి ఎటర్నల్ రీఫ్ అనే కంపెనీ ఓ వినూత్నమైన ఆఫర్ ఇస్తోంది. ప్రత్యేకమైన కాంక్రీట్‌తో మనిషి చితాభస్మాన్ని కలిపి పగడపు దిబ్బలను వృద్ధి చేసేందుకు ఉపయోగిస్తుంది ఈ కంపెనీ.
తేలియాడే దీవిపై...
జపాన్ మాదిరిగానే హాంకాంగ్‌లోనూ స్థలం సమస్య ఎక్కువ. ఈ సమస్యను అధిగమించేందుకు అక్కడ తేలియాడే దీవి ఒకదాన్ని సిద్ధం చేస్తున్నారు. పేరు ఫ్లోటింగ్ ఎటర్నిటీ. ఏకంగా 3.70 లక్షల మంది చితాభస్మాన్ని ఉంచేందుకు ఏర్పాట్లు ఉన్నాయి దీంట్లో.
డిజిటల్ అవతారం ఎత్తేయవచ్చు..
చనిపోయాక మన ఫేస్‌బుక్ అకౌంట్లు ఏమవుతాయి? ఇలాంటి సందేహం మీకుందా.. స్వీడన్‌కు చెందిన కంపెనీ ఒకటి చనిపోయిన వారి డిజిటల్ అవతారాలను సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మన సోషల్ మీడియా వ్యవహారాలన్నింటినీ ఆకళింపు చేసుకున్న తరువాత కృత్రిమ మేధో వ్యవస్థతో ఏర్పడే డిజిటల్ అవతారం.. అచ్చం మీ మాదిరిగానే కామెంట్లు పెట్టడం, ట్వీట్లు చేయడం వంటివి చేస్తుందన్నమాట! ఇది కాస్త భయం గొలిపేలా ఉన్నా దీన్ని నిజం చేసేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నట్లు ఫెనిక్స్ బెన్‌గ్రేవినింగ్ అంటోంది!
Comments
Please login to add a commentAdd a comment