సంకీర్త్
కాచిగూడ: అమెరికాలోని ఆస్టిన్ నగరంలో ఇటీవల హత్యకు గురైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గుండం సంకీర్త్ (24) అంత్యక్రియలు సోమవారం కుటుం బ సభ్యులు, బంధుమిత్రుల ఆశ్రునయనాల మధ్య కాచిగూడ హరాస్‌పెంటలోని హిందూ శ్మశానవాటికలో జరిగాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సంకీర్త్ మృతదేహాన్ని ఆదివా రం అర్ధరాత్రి తర్వాత కుద్భిగూడలోని ఆయన నివాసానికి తీసుకొచ్చారు. మృతదేహాన్ని చూడగానే తల్లిదండ్రులు, బంధు,మిత్రులు కన్నీరుమున్నీరయ్యారు.
చేతికి అందొచ్చిన కుమారుడు అందనంత దూరం వెళ్లిపోవడంతో గుండెలు బాదుకుంటూ రోదిస్తున్న సంకీర్త్ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవ్వరి తరం కాలేదు. బీజేపీ శాసనసభ పక్షనేత జి.కిషన్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి, కార్పొరేటర్ ఎక్కాల చైతన్య కన్నా, బీజేపీ నేతలు కన్నె రమేష్‌యాదవ్, కైలాస్ నాగేష్, టీఆర్‌ఎస్ నేతలు ఎక్కాల కన్నా, ఊక రాజుగుప్తా, మున్నూరుకాపు మహాసభ అధ్యక్షుడు కాశెట్టి ఆనంద్, మున్నూరుకాపు విద్యార్థి వసతి గృహం ట్రస్ట్‌బోర్డు సభ్యులు ప్రొఫెసర్ మ్యాడం వెంకట్‌రావు తదితరులు సంకీర్త్ మృతదేహం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించా రు. అనంతరం కుద్భిగూడ నుంచి హరాస్‌పెంట శ్మశానవాటిక అంతమ యాత్ర నిర్వహించారు. సంకీర్త్ మృతదేహానికి తండ్రి గుండం విజయ్‌కుమార్ తలకొరివి పెట్టారు. వందలాది మంది బంధు, మిత్రుల అశ్రునయనాల మధ్య అత్యక్రియలు పూర్తి చేశారు.