
ప్లాట్‌ఫాంలోని జనాలపైకి కారును దొర్లించారు
బ్రసెల్స్: కొత్త సంవత్సరం సందర్భంగా కొందరు ఆకతాయి కుర్రాళ్లు జనాలను బిత్తరపోయేలా చేశారు. మెట్రోరైలు కోసం ఎదురుచూస్తూ ప్లాట్‌ఫాం మీద కిక్కిరిసిపోయిన ప్రయాణికుల మీదకు మెట్లపై నుంచి కారును తోసేశారు. బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో ఈ ఘటన జరిగింది. ఉగ్రవాద దాడుల హెచ్చరికల నేపథ్యంలో బెల్జియం వాసులు బిక్కుబిక్కుమంటూ కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకొన్నారు. కనీసం వేడుకల సందర్భంగా టపాకులు కాల్చేందుకు పోలీసులు అనుమతించలేదు.
ఈ నేపథ్యంలో గురువారం (డిసెంబర్ 31న) రాత్రి క్లెమెన్‌సియా మెట్రోరైలు స్టేషన్‌లో కొంతమంది ఆకతాయి కుర్రాళ్ల మూక మూగింది. స్టేషన్‌లో మెట్ల మీద ఎవరూలేని సమయం చూసి.. ఓ ఆకుపచ్చ రంగు కారును మెట్ల మీద కిందకు దొర్లించారు. కింద ప్లాట్‌ఫాంలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు వేచిచూస్తున్నారు. దడదడమని చప్పుడు చేసుకుంటూ కారు దొర్లిపడటంతో ప్రయాణికులు ఒక్కసారిగా బిత్తరపోయారు. తన మీదకు వస్తున్న కారు నుంచి ఓ ప్రయాణికుడు అతికష్టం మీద తప్పించుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి 10 సెకండ్ల వీడియో క్లిప్ విడుదల కావడంతో ఆకతాయిల దుండగ చర్య స్థానికంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. ఈ ఘటనలో ఆకతాయిలు దుందుడుకు చర్య మాత్రమే కాదు భద్రతా దళాల నిర్లక్ష్యం కూడా కనపడుతున్నదని బ్రసెల్స్ ఎంపీ జమాల్ ఇకాజ్‌బన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.