
జర్మనీలో ఒకే రోజు మాస్ రేప్‌లు
బెర్లిన్: జర్మనీలో రెండువేల సంవత్సరాల చరిత్ర కలిగిన కొలోగ్నీ నగరం నాజీల కాలం నాటి పైశాచికత్వాన్ని మళ్లీ కళ్లారా చూసింది. కెథడ్రెల్ చర్చి కూడలి వద్ద ఒళ్లు గగురుపొడిచే ఘోరం జరిగింది. ఒకర్ని కాదు, ఇద్దర్ని కాదు ఏకంగా 120 మంది అమ్మాయిలను అల్లరి మూకలు గ్యాంగ్ రేప్‌లు చేశాయి. దాదాపు వెయ్యిమంది ఉన్న ఓ ముఠా ఐదుగురు నుంచి 30 వరకు బృందాలుగా విడిపోయి అమ్మాయిలను పశువుల్లా తరుముతూ వెంటబడి, వెంటాడి.. వెంటాడి లైంగికంగా వేధించాయి. సెల్‌ఫోన్లు, పర్సులను ఎత్తుకెళ్లాయి.
లైంగికంగా సామూహిక దాడులకు పాల్పడిన మృగాళ్లలో సగం మంది పీకలదాకా తాగి ఉండగా, మిగతా వాళ్లు డ్రగ్స్ మత్తులో ఉన్నారట. ఇలాంటి ఘోరం ఈ ఒక్కనగరానికే పరిమితం కాలేదు. ఆ రోజున జర్మనీ లోని స్టట్‌గార్ట్, డస్సెల్‌డార్ఫ్, హంబర్గ్, మ్యూనిచ్, బెర్లిన్ నగరాల్లో కూడా అమ్మాయిలపై పాశవికంగా లైంగిక దాడులు జరిగాయి. ఒక్కో నగరంలో 10 నుంచి 50 వరకు అమ్మాయిలు లైంగిక దాడులు ఎదుర్కొన్నట్టు జర్మనీ పోలీసులకు ఫిర్యాదులందాయి.
డిసెంబర్ 31వ తేదీన కొత్త సంవత్సరం వేడుకల్లో జనం మునిగిపోయినప్పుడు జరిగిన ఈ ఘోర లైంగిక కాండ గురించి ప్రపంచానికి ఆలస్యంగా తెల్సింది. వారం పదిరోజులుగా ఈ దారుణాలపై మౌనం వహించిన జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ మొదటి సారిగా బుధవారం నాడే నోరు విప్పడంతో మెల్ల మెల్లగా రేప్‌ల సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు కూడా ఈ వార్తలకు పెద్దగా ప్రాచుర్యం కల్పించలేదు. సిరియా, ఇరాక్, అఫ్ఘానిస్తాన్ తదితర దేశాల నుంచి లక్షలాదిగా వచ్చిన వలసదారుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయకూడదనే సదుద్దేశంతోనే తాము ఆ వార్తలకు అంత ప్రాధాన్యత ఇవ్వలేదని మీడియా అంటోంది. వలసదారులను స్వయంగా దేశంలోకి సాదరంగా ఏంజెలా మెర్కెల్ ఆహ్వానించారని, అలా వలస పేరుతో వచ్చిన వారిపై నిందమోపడం సమంజసం కాదనే ఉద్దేశంతోనే తామూ మౌనం వహించామని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఆ రోజు కోలోగ్ని కూడలి వేడుకల వద్ద కేవలం 190 మంది పోలీసులు మాత్రమే ఉండడం వల్ల వెయ్యి మంది ముఠా చేసిన లైంగిక దాడులను అరికట్టలేకపోయామని వారు తెలిపారు.
అరబ్‌లో మాట్లాడిన వారు, ఉత్తర అమెరికాకు చెందిన వారే తమపై లైంగిక దాడులకు పాల్పడ్డారని బాధితుల్లో ఎక్కువ మంది ఆరోపించారు. జర్మనీకి చెందిన మిషెల్ అనే 18 యువతి కూడా తనపై అరబ్‌లో మాట్లాడిన దుండగులే లైంగిక దాడికి పాల్పడ్డారని బుధవారం సాయంత్రం ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అలాగే తన మిత్రులతో కలసి ఓ నైట్ క్లబ్ నుంచి ఓ రెస్టారెంట్‌కు వెళుతుండగా తమపై లైంగిక దాడి జరిగిందని లొట్టా అనే 19 ఏళ్ల అమ్మాయి మీడియాకు తెలిపింది. సామూహిక లైంగిక దాడికి గురైన బాధితుల్లో ప్రతిఒక్కరూ నిందితులంతా విదేశీయులేనని చెప్పడం అనుమానాలకు దారితీస్తోంది. బాధితుల నుంచి తమకు అందిన ఫిర్యాదుల మేరకు ఇప్పటి వరకు 30 మంది నిందుతులను అరెస్ట్ చేశామని, సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో వారిలో ఇద్దరిని విడిచి పెట్టామని పోలీసు అధికారులు తెలిపారు. మాస్ రేప్‌ల వెనకనున్న ముఠా డ్రగ్ మాఫియా కావచ్చని పోలీసులు అనుమానిస్తుండగా, నేరానికి పాల్పడ్డవారు ఏ దేశస్థులైనా, ఏ జాతీయులైన జర్మనీ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఛాన్సలర్ ఏంజెలా మార్కెల్ ప్రకటించారు.
అసలు మోర్కెల్ అనుసరించిన వలస విధానం వల్ల ఈ ఘోరాలు జరిగాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మధ్యప్రాచ్య సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు జర్మనీకి వలసవచ్చిన వారి సంఖ్య 11 లక్షలకు చేరిందని ఇటీవలే జర్మనీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈజిప్టు రాజధాని కైరోలోని తహ్రీర్ స్క్వేర్ వద్ద 2011లో కూడా ఇలాంటి మాస్ రేప్‌లు జరిగాయి.