గ్యాంగ్ రేప్ చేసినందుకు ఖరీదు కట్టారు
ఇస్లామాబాద్: ఓ బాలికను సామూహిక అత్యాచారం చేసినందుకు 12 కిలోలు గోధుమలు ఇవ్వాలని ఖరీదు కట్టారు. కేసు పెట్టకుండా ఉండేందుకు ఈ మేరకు పరిహారం చెల్లించాలని పెద్దలు తీర్మానించారు. పాకిస్తాన్లోని సింధు ప్రావిన్స్లో ఉమెర్ కోట్ జిల్లా గులామ్ నబీ షా ప్రాంతంలో ఈ దారుణం జరిగింది.
గిరిజన తెగకు చెందిన బాలికపై ఇటీవల గ్యాంప్ రేప్ చేశారు. ఆ ప్రాంతంలో గిరిజన సంప్రదాయం ప్రకారం పెద్దల సమక్షంలో వివాదాలు పరిష్కరించుకుంటారు. స్థానిక పెద్దలు కలసి నిందితులు 12 కిలోలు గోధుమలను బాధితురాలి కుటుంబానికి ఇవ్వాలని తీర్పు చెప్పారు. ఇందుకు బాలిక కుటుంబం వ్యతిరేకించడంతో ఊరి నుంచి వెలేస్తామని హెచ్చిరించారు. జరిగిన ఘోరంపై బాధితురాలి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే కేసును వెనక్కు తీసుకోవాలని నిందితులు బెదిరించారు. ఈ విషయం మీడియాలో రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. బాధితురాలి కుటుంబానికి రక్షణ కల్పించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.