హాలీవుడ్ రేంజ్లో ఆ తండ్రి సాహసం
జార్జియా: ఒక మనిషి ఎంతెత్తుకు ఎదిగినా.. ఎన్ని ప్రభావాలకు లోనవుతున్నా పేగు బంధం ముందుమాత్రం బానిసవ్వాల్సిందే. ఆ సమయంలో భావోద్వేగాలే పనిచేస్తాయి తప్ప బతుకు గుర్తుకురాదు. అందుకే మానవ సంబంధాలు గొప్పవని అంటుంటారు. ఈ మాటలు నిజమేనని మరోసారి రుజువు చేశాడో కన్నతండ్రి. తన కుమారుడిని రక్షించుకునేందుకు తన ప్రాణాలు సైతం లెక్కచేయకుండా వేగంగా దూసుకెళుతున్న కారుమీదకు దూకాడు. అతడు కిందపడేసేందుకు కారును అటుఇటూ తిప్పిన పట్టు విడవకుండా కారునే వేలాడుతూ చివరికి రన్నింగ్లోనే అద్దం పగులగొట్టి కారును ఆపేసి ఆ కారు దొంగ అంతు చూశాడు.
అచ్చం హాలీవుడ్ సినిమాను తలపించే రేంజీలో ఉన్న వీడియో ఓ సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. వివరాల్లోకి వెళితే జార్జియాలో మాల్కోమ్ మిల్లోన్స్ అనే వ్యక్తి కారులో గ్యాస్ కొట్టించేందుకు దిగగా అతడి భార్య బిల్లు చెల్లించేందుకు స్టోర్ లోకి వెళ్లింది. ఆ కారు బ్యాక్ సీటులో తన కుమారుడు ఉన్నాడు. ఇంతలో అతడి కళ్లుగప్పిన ఓ కారు దొంగ కారులోకి వెళ్లి ఏకంగా కారునెత్తికెళ్లే ప్రయత్నం చేశాడు. దీంతో మాల్కోమ్ అమాంతం కారుపై దూకి ఓ 250 మీటర్లపాటు పోరాడుతూ వెళ్లాడు. ఎట్టకేలకు ఆ దొంగను నిలువరించి అతడి చేయి విరగ్గొట్టి పోలీసులకు అప్పగించాడు. తన తండ్రి చేసిన సాహసానికి ఆ ఎనిమిదేళ్ల బాలుడు, భార్య అక్కడి చుట్టుపక్కలవారు ముగ్దులై పోయారు.