
ప్రాంతీయ యుద్ధానికి సిద్ధంకండి
సైన్యానికి చైనా అధ్యక్షుడి పిలుపు
బీజింగ్/న్యూఢిల్లీ: చైనా సైన్యం ‘ప్రాంతీయ యుద్ధం’లో విజయం సాధించేందుకు యుద్ధసన్నద్ధంగా ఉండాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. ఈ విషయంలో కేంద్ర నాయకత్వం తీసుకునే అన్ని నిర్ణయాలను కచ్చితంగా పాటించాలని కూడా ఆయన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ)కి సూచించారు. చైనా సెంట్రల్ మిలిటరీ కమిషన్, చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఆయన ఈ పిలుపునిచ్చారు. పీఎల్‌ఏ ప్రధాన కేంద్ర బలగాలకు చైనా కమ్యూనిస్ట్ పార్టీపై పూర్తిస్థాయి విశ్వాసం ఉండాలని, కేంద్ర నాయకత్వం తీసుకునే నిర్ణయాలూ అమలయ్యేలా చూడాలని జిన్‌పింగ్ అన్నారు. జిన్ పింగ్ భారత పర్యటనుంచి స్వదేశం తిరిగివచ్చిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేసినట్టు జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. ‘ప్రాంతీయ యుద్ధం’ కోసం చైనా బలగాలు యుద్ధసన్నద్ధంగా ఉండాలని, సమాచార పరిజ్ఞాన యుగంలో యుద్ధంలో గెలిచేలా తమ సామర్థ్యాలకు పదునుపెట్టాలని కూడా జిన్‌పింగ్ అన్నారు. ‘ప్రాంతీయ యుద్ధం’ జిన్‌పింగ్ ఇలా వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కానప్పటికీ, ఇటీవల చైనా సైన్యం పదేపదే చొరబాటుకు పాల్పడిందన్న వార్తల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.
ఆ కథనాలన్నీ ఊహాగానాలే: చైనా
ప్రాంతీయ యుద్ధంలో నెగ్గడానికి తమ సామర్థ్యానికి పదునుపెట్టాలంటూ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సైన్యానికి సూచించడం చర్చనీయాంశమైంది. భారత్‌తో సరిహద్దు వివాదం నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారన్న కథనాలతో దీనిపై చైనా స్పందించింది. జిన్‌పింగ్ వ్యాఖ్యలపై కథనాలన్నీ అనవసర ఊహాగానాలేనని కొట్టిపారేసింది. చర్చలతోనే సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకోవాలని ఇరు దేశాల నేతలు ఏకాభిప్రాయంతో ఉన్నారని పేర్కొంది. భారత మీడియా కథనాలు ఊహాగానాలేనని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చున్యింగ్ పేర్కొన్నారు.