ఘోర రోడ్డు ప్రమాదం: 61 మంది దుర్మరణం
అక్రా : ఘనాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ప్రయాణీకులతో వెళ్తున్న బస్సు... టమాటో లోడుతో వెళ్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 61 మంది మరణించారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. ఈ మేరకు ఘనా ఉన్నతాధికారులు వెల్లడించారు. ఘనా రాజధాని అక్రాకి 400 కిలోమీటర్ల దూరంలోని కింటెంపో పట్టణంలో గురువారం రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. క్షతగాత్రులు పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు.
ఈ ప్రమాదంపై ఘనా ప్రధాని తీవ్ర దిగ్బాంత్రి చెందారు. మృతులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రదేశం ప్రయాణికుల మృతదేహాలు చెల్లాచెదురుగా పడి రక్తంతో నిండిపోయింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. ఘనాలో రోడ్డు ప్రమాదాలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. గతేడాది రోడ్డు ప్రమాదాల్లో 1600 మంది మరణించారని ఆ దేశ జాతీయ రహదారి సురక్షిత కమిషన్ తన నివేదికలో వెల్లడించింది.