రాకాసి గద్ద ఎంత పని చేసింది!
ఆరు సంవత్సరాల బాలుడిపై దాడిచేసి ఏకంగా ఎత్తుకెళ్లేందుకు యత్నించింది. ఉత్తర ఆస్ట్రేలియాలోని అలైస్ స్పింగ్స్ డెసర్ట్ పార్క్ ఇటీవల ఈ ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా గద్దలు చిన్న చిన్న పక్షులు, జంతువులపై దాడి చేస్తుంటాయి. చిన్న ప్రాణులపై దాడిచేసి వాటిని తమ ఆహారంగా తీసుకెళ్లి తింటాయి.
ఆస్ట్రేలియాలో ఓ గద్ద చేసిన పని అక్కడున్న అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. పార్కులో ఓ బాలుడు కూర్చుని ఉండగా ఎక్కడినుంచో ఓ గద్ద వచ్చి వాలిపోయింది. ఆ పిల్లాడి పక్కన ఎవరూ లేనిది గమనించి ఆ బాబుపై దాడిచేయడం ప్రారంభించింది. వెంటనే బాలుడు ఏడుపు అందుకున్నాడు. ఇది చూసిన కొందరు వ్యక్తులు వెంటనే గట్టిగా అరవడం మొదలుపెట్టారు. గద్ద మాత్రం వారి అరుపులు పట్టించుకోకుండా బాలుడ్ని తన పదునైన గోళ్లతో ఎత్తుకెళ్లేందుకు యత్నించింది. సమీపంలో ఉన్న కొందరు గద్దను తరిమివేయండంతో బాలుడు గాయాలతో బయటపట్టాడు. సహజంగా చిన్న జంతువులు, పక్షులపై దాడిచేసే వాటిని తినే గద్ద, ఈ విధంగా బాలుడ్ని ఏకంగా ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించడంతో ఆశ్చర్యానికి లోనైనట్లు చెబుతున్నారు.
ఆ బాలుడి తల్లి ఏదో పనిమీద కాస్త పక్కకు వెళ్లొచ్చేలోపే జరిగిన ఘటనపై షాక్కు గురైంది. తన కొడుకు కేవలం చిన్న చిన్న గాయాలతో బయటపట్టాడని బాలుడి తల్లి చెప్పింది. ఆ సమయంలో అక్కడే ఉన్న విక్టోరియాకు చెందిన వ్యక్తి కీనన్ లుకాస్ గద్ద ఆ పిల్లాడిని ఎత్తుకెళ్లేందుకు యత్నిస్తుండగా ఓ ఫొటో తీసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. దీంతో ఈ ఘటన వైరల్ గా మారిపోయింది. డెసర్ట్ పార్క్ అధికారులను ఈ విషయంపై ప్రశ్నించగా, ఆ బాలుడిపై ఏ జంతువు దాడిచేయలేదని, ఆడుకుంటుండగా కొన్ని గాయాలయ్యాయని వివరణ ఇచ్చుకున్నారు.