అసాంజేకు స్వేచ్ఛనివ్వాలి: ఐరాస
లండన్: వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకు ఐక్యరాజ్యసమితి విచారణ కమిటీ ఊరట కల్పించింది. ఆయనకు తక్షణం స్వేచ్ఛనివ్వాలని విచారణ కమిటీ బ్రిటన్, స్వీడన్‌లకు స్పష్టంచేసింది. ఐదేళ్ల నిర్బంధ జీవితం గడిపిన ఆయనకు నష్టపరిహారం చెల్లించాలని శుక్రవారం తేల్చిచెప్పింది. జెనీవా కేంద్రంగా ఐదుగురు సభ్యుల కమిటీ ఈ వ్యవహారంపై విచారణ జరిపింది. అసాంజేపై స్వీడన్‌లో అత్యాచారం కేసు నమోదు కావడంతో ఆయన 2012 నుంచి లండన్‌లోని ఈక్వెడార్ ఎంబసీలో తలదాచుకుంటున్నారు.
బయటకు వస్తే పోలీసులు అరెస్టుచేసి స్వీడన్‌కు, తర్వాత అమెరికాకు అప్పగిస్తారన్నది అసాంజే భయం. ఇరాక్, అఫ్గానిస్తాన్‌లలో అమెరికా అకృత్యాల రహస్య సమాచారాన్ని ఆయన వికీలీక్స్ ద్వారా బయటపెట్టడం తెలిసిందే. కమిటీ నిర్ణయాన్ని తాము పట్టించుకోబోమని బ్రిటన్, స్వీడన్‌లు స్పష్టంచేశాయి. తాను నిర్దోషిని అనడానికి ఈ తీర్పు నిదర్శనమని అసాంజే పేర్కొన్నారు.